కరోనాపై మరింత స్పష్టత రావాలి

పూర్తి అవగాహనకు రావడానికి మరికొంత సమయం

More clarity on Corona

కరోనా కోరలకు చిక్కి కకావిలకమవుతున్న ప్రపంచానికి అలుపెరగని సేవలం దిస్తున్న వైద్యబృందాలకు, శాస్త్రవేత్త లకు ప్రజలంతా సంఘీభావం తెలపాలి.

మానవతా దృక్పథంతో ప్రాణాలకు తెగించి కరోనాపై పోరు చేస్తున్న యావత్‌ ప్రపంచ వైద్యులకు వైద్యశాస్త్ర వేత్తలకు అభినందనలు తెలియచేసే తరుణం ఆసన్నమైనది.

ఇప్పటివరకు మనం దేశ సరిహద్దులను కాపాడే సైనికుల త్యాగ నితరతినే శ్లాఘించాము. ప్రపంచమంతా కరోనా కబంధహస్తాల్లో చిక్కుకుపోయి, జనజీవనం స్తంభించిపోయిన నేపథ్యంలో మనం మన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వహించాలి.

సాఫీగా సాగు తున్న జనజీవనంపై శరాఘాతంలా ఈ ఊహాతీతమైన విలయ గర్జన నుంచి కాపాడేది కేవలం వైద్యరంగమే.

మనం మన నిర్లక్ష్యంతో మన ప్రాణాలకే కాకుండా ఇతరుల ప్రాణాలను హరించే రోగకారకాలుగా మారడం క్షంతవ్యంకాదు. కొవిడ్‌-19 వైరస్‌ విషయంలో రోజుకో కథనం వినబడుతున్నది.

ఆకస్మాత్తుగా కోరలు చాచి మానవాళినే కబళించడానికి సన్నద్ధమైన ఈ వైరస్‌ గురించి శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికిప్పుడే ఖచ్చితమైన సమాచారం అందించలేకపోతున్నారు.

వైద్యశాస్త్రానికే సవాలు విసిరిన కరోనా వైరస్‌ గురించి పూర్తి అవగాహనకు రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

ఈ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్‌ బాహ్య ప్రపంచంలోకి అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది కాల మైనా పడుతుంది.

ఇప్పటివరకూ కరోనా వైరస్‌ మానవ శరీరం లోకి ప్రవేశించిన తర్వాత దానికి సంబంధించిన రోగ లక్షణాలు బహిర్గతం కావడానికి రెండు వారాల సమయం పడుతుందని వైద్య విజ్ఞానరంగంలోని నిష్ణాతులు పేర్కొన్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం కొవిడ్‌-19 జీవితకాలం ఐదు రోజులు మాత్రమే అనే సమాచారం వెలుగులోకి వచ్చింది.

ఏదిఏమైన ప్పటికీ ఈ వ్యాధి గురించి పూర్తి అవగామనకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఇప్పటికే ప్రపంచమంతా స్తంభించిపోయింది.

అంతర్జాతీయసరిహద్దులు మూతపడ్డాయి. విమానాశ్రయాలు, రైల్వేలు, రోడ్డుమార్గాలు స్తంభించి, దేశాలు, రాష్ట్రాలు లాక్‌డౌన్‌ లోకి వెళ్లిపోయాయి.

చైనాలోని వూహాన్‌ ప్రాంతం యావత్‌ ప్రపంచానికే ఈ మహమ్మారిని అంటించింది. చైనాలో ఇప్పటికే మూడువేల మందికిపైగా ఈ మహమ్మారికి గురై మృత్యువాతపడ్డారు.

తాము కరోనాపై విజయం సాధించామని, తమ దేశంలో కరోనాను పూర్తిగా నిలువరించామని ఆ దేశాధ్యక్షు డు జిన్‌పింగ్‌ చెబుతున్నా ప్రపంచ ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

నియంతృత్వ పాలనలో సమాచార గోప్యత కూడా ఒక భాగమే నన్న భావన అక్షరసత్యం. ఏదిఏమైనప్పటికీ చైనా ప్రభుత్వం కరోనా విషయంలో నిజాలను నిజాయితీగా ప్రపంచం ముందుంచాలి.

ఈ విపత్తుపై వాస్తవాలను బహిర్గతం చేసినప్పుడే అంతర్జా తీయ సమాజానికి, వైద్య ప్రపంచానికి కరోనా విషయంలో ఖచ్చితమైన అంచనా ఏర్పడుతుంది. కరోనా వైరస్‌ విషయంలో చైనా పాటించిన గోప్యత ప్రపంచానికే ముప్పుతెచ్చింది.

కరోనా విషయంలో ఏ దేశమైనా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తే జరిగే పరిణా మాలు ఎలా ఉంటాయో ఇటలీ, ఇరాన్‌, స్పెయిన్‌ దేశాలలో సంభవించిన కరోనా మరణాలే సాక్షీభూతం.

ఈ దేశాలు ప్రపంచా నికే గుణపాఠం నేర్పాయి. ఇటలీలో మరణాల సంఖ్య ఆరువేలకు దగ్గరలో ఉంటే అగ్రరాజ్యమైన అమెరికాలో కరోనా మృతుల సంఖ్య నాలుగువందలకు దాటింది.

కొన్ని దేశాల్లో కేవలం ఒక్క రోజులోనే వందల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య 16వేలకు దగ్గరలో ఉంటే బాధితుల సంఖ్యనాలుగు లక్షలకు చేరింది.

భారత్‌లో 469 కేసులు నమోదు కావడం మృతుల సంఖ్య రెండంకెలకు చేరుకోవడం జరగబోయే విపరిణామాలకు సంకేతంలా మనం భావించాలి.

భారతదేశంలో ముందుచూపుతో అత్యవసర సేవలను మినహాయించి మిగిలిన రంగాలపై లాక్‌డౌన్‌ ప్రకటించింది. విమానాశ్రయాలను, రైల్వే రహదారులను మూసివేసింది.

బ్యాంకుల పనివేళలను మధ్యాహ్నం రెండు గంటలకే పరిమితం చేసింది. శ్రీహరికోట వంటి అంతరిక్ష ప్రయోగవేదికలను కూడా మూసివేయడం జరిగింది. లోక్‌సభ వాయిదా పడింది.

అత్యున్నత న్యాయస్థానం మూతపడింది. కేవలం వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారానే వాదనలను వినే వెసులుబాటును సుప్రీంకోర్టు కల్పించింది.

కరోనా వ్యాధిపై భారత్‌ దాదాపు యుద్ధాన్నే ప్రకటించిందని మనం భావించాలి. ఇతర దేశాలనుండి వచ్చే వారిని పరీక్షించడం, క్వారంటైన్‌ జోన్స్‌ పెంచ డం ముందస్తు చర్యలలోని భాగమే.

దేశంలోని పలు రాష్ట్రాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. నిత్యావసరాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవస్థలను షెట్‌డౌన్‌ చేశాయి.

కేరళ, మహారాష్ట్రల్లో కరోనా ఉధృత్తి తగ్గలేదు. భారతప్రభుత్వం, పలురాష్ట్రాలు చేపడుతున్న చర్యలు సత్ఫలితాలినిస్తాయో లేదో కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కరోనా బారినపడి కుదేలైపోయింది.

భారత దేశం వంటి వర్ధమాన దేశాల ఆర్థిక పరిస్థితులు మరింత మంద గమనంలోకి జారిపోవడం బాధాకరం. భారతదేశంలో లక్షలాది సంపద హరించుకుపోయింది. రూపాయి విలువ అత్యంత కనిష్టస్థాయికి దిగజారిపోయింది. ఎగుమతి దిగుమతులు లేక పలు రంగాలు చిన్నాభిన్నమైపోతున్నాయి.

వ్యవసాయరంగం మరింత సంక్షోభంలో కూరుకుపోతున్నది. అయితే ప్రజల ప్రాణాలే అన్నిం టికన్నా మిన్నగా భావించి భారత ప్రభుత్వం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు స్వాగతించదగినవే. కరోనాకు లాక్‌డౌన్‌ లు ప్రత్యామ్నాయం కాజాలవనే వైద్యశాస్త్రవేత్తల అభిప్రాయం గమనార్హం.

రెక్కాడితే కానీ డొక్కాడని పూటగడవని పేదదేశాల ప్రజలకు లాక్‌డౌన్‌ వంటి చర్యలు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నా యి.

లాక్‌డౌన్‌ రిలాక్షేషన్‌ సమయంలో ప్రజలంతా ఒకేసారి గుమిగూడడం, పరిమిత సంఖ్యలో దుకాణాలు తెరవడం వలన నిత్యావసరాలకై బారులుతీరే పరిస్థితులు నెలకొంటున్నాయి.

స్తబ్దత నుండి ఒకేసారి జనసమూహం బయటకు రావడం వలన కరోనా ఉధృతికి మరింత ఊతం ఇచ్చినట్టే. కాబట్టి లాక్‌డౌన్‌ల విషయం లో ప్రభుత్వం పునరాలోచించాలి.

ప్రపంచమొత్తం మీద కరోనా మృతులు సుమారు 3.4శాతం. అయితే ఇందులో ఇతర వ్యాధులు సోకి మరణించినవారిని కూడా కరోనా మరణాలుగా పేర్కొంటున్నారని అంతర్జాతీయ సంస్థల ఆరోపణ.

సహజంగా రోగ నిరోధకశక్తి లేని వారికి ఏ వ్యాధి అయినా త్వరగానే సోకుతుంది. కరోనా కూడా అటువంటిదే.

అయినప్పటికీ మనం మన జాగ్రత్తల్లో ఉండటమే మంచిది. వైద్యసదుపాయాలను మరింత పెంచాలి. అనుమానితులను తక్షణమే క్వారంటైన్‌ జోన్స్‌కి తరలించాలి.

ఐసోలేషన్‌ సదుపాయాలను విస్తృతపరచాలి. పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యత కల్పించాలి.

అధిక ఉష్ణోగ్రతలో కరోనా వైరస్‌ జీవించలేదనే అభిప్రాయం సరికాదని ప్రస్తుత పరిణామాలు నిరూపిస్తున్నాయి.

ఏదిఏమైనప్ప టికీ ప్రజలు కూడా ప్రభుత్వాలతో సహకరించాలి. మన నిర్లక్ష్యం మరికొందరి ఆయువుకు ముప్పనే విచక్షణ కలగాలి.

  • సుంకవల్లి సత్తిరాజు

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/health1/