ఆజాద్ హింద్ ఫౌజ్ విప్లవ సైన్యాధినేత
నేడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

భారత స్వాతంత్య్రోద్యమ పోరాట చరిత్రలో దేశభక్తాగ్రణ్యుడైన నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌కు స్వతంత్ర భారతావని నాడూ నేడూ ఎన్నటికీ కృతజ్ఞతా పూర్వకంగా తలవంచి ప్రణతులు సమర్పించవలసినదే. నేతాజీగా భారతీయ ప్రజఆత్మీయగా గౌరవించి ఆరాధించుకొనే సుభాష్‌చంద్రబోస్ జీవితం 1919 నుండి 1945 వరకు సుమారు మూడు దశాబ్దాలు ఏ జాతినేతకు లేని విశిష్ట వ్యక్తిత్వంతో జాతిని ప్రభావితం చేసింది.
గాంధీజీ నాయ కత్వంలోని భారత జాతీయ కాంగ్రెస్‌ను మితవాద ధోరణులను వ్యతిరేకించే యువ విప్లవ సమరోత్తేజంతో,స్వదేశంలో సుమారు రెండు దశాబ్దాలు, సుభాష్‌చంద్రబోస్ స్వాతంత్య్రపోరాట వివిధ ఘట్టాలలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని ప్రతిఘటించారు. దేశానికి స్వాతంత్య్రాన్ని యాచన, వేడుకోలు వంటి మితవాద రాజకీయ కార్యాచరణతో సాధించే ఉద్యమాలను సుభాష్‌చంద్రబోస్ అంగీ కరించలేదు. గాంధీజీతో విభేదించి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా 1939-40 సంవత్సరాలలో సుభాష్ సాహస పోరాటతత్త్వం జాతిని విస్మరింపచేసింది.
ప్రాణాలను సైతం పణంగా పెట్టి త్యాగం, సాహస రుధీరతర్పణంతో బ్రిటిష్ నిరంకుశత్వాన్ని దేశం నుంచి పారద్రోలాలని సుభాష్ ఆకాంక్షించి ఆజాద్ హింద్ ఫౌజ్ సమర సైన్యాధ్యక్షునిగా చరిత్ర సృష్టించా రు.యువకునిగా అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థిగా ఐఎఎస్ ఉత్తీర్ణతను,తృణప్రాయంగా విసర్జించి, సర్.సి.ఆర్.దాస్ శిష్యు నిగా భారత రాజకీయరంగంలో జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, జయప్రకాశ్ నారాయణ్ వంటి జాతినేతల కోవలో అగ్రశ్రేణి రాజకీయ నాయకునిగా బ్రిటిష్ ఆగ్రహానికిగురయ్యారు.
బ్రిటిష్ ప్రభుత్వం దేశంలో వ్ఞన్నకాలంలో తీవ్రమైన జైలుశిక్షలతో నిర్బంధాలకు, ఆయన స్వాతంత్య్రసమరోత్తేజాన్ని అణచివేసే కాఠిన్యంతో వ్యవహరించింది. భగత్సింగ్, అల్లూరి శ్రీరామరాజు వంటి దేశభక్తి, త్యాగనిరతి, సాహసవీరత్వంతో మాతృభూమిని బానిస సంకెళ్ల నుంచి విముక్తి కలిగించే మహానేతగా నేతాజీని నేటికీ భారతావని ఆరాధిస్తోంది. సుభాష్ చంద్రబోస్ 1939-40 ద్వితీయ ప్రపంచ సంగ్రామం కారుమేఘాలు కమ్ముకొంటున్న నేపథ్యాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని దేశం నుంచి పారద్రోలడానికి అనువైన, అదునుగాభావించారు.
అప్పటికే గృహ నిర్బంధంలో వ్ఞన్న సుభాష్,బ్రిటిష్‌పాలకుల కళ్లుకప్పి దేశంనుంచిఅంతర్ధానమై, జపాన్, జర్మనీ, ఇటలీ నియంతలతో చేతులు కలిపి భారత స్వాతంత్య్రోదయ చరిత్రలో సమర ఘట్టం సృష్టించి, అమరత్వం సాధించారు.1941-1945లలో నాలుగు సంవత్సరాల ఏడు నెలలు అజాద్ హింద్ ఫౌజ్ జైహింద్ సమర నినాదంతో, రెండవ ప్రపంచ సంగ్రామంలో బ్రిటన్ పరాజయానికి పురోగ మించింది.సుభాష్‌చంద్రబోస్, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రా జ్యపరాజయం కోసం స్వతంత్రభారత సేనావాహిని సర్వసైన్యా ధ్యక్షునిగా రణభూమిలో హిట్లర్,ముసోలినీ వంటి నియంతలతో చేతులు కలిపి అంతర్జాతీయ రణరంగంలో బ్రిటిష్ నిరంకుశత్వా న్ని స్వరాజ్య సాధనాలక్ష్యంతో ప్రతిఘటించారు.
‘మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఇస్తాను అది సుభాష్ సందేశం. స్వాతంత్య్ర భారతిని, బ్రిటిష్ పరాజయంతో సాధించి మహాత్మునికి కానుకగా సమర్పించాలనినేతాజీ తపించా రు.గాంధీజీని ప్రప్రథమంగా జాతిపితగా సంబోధించిన సుభాష్, మార్గంవేరైనా గాంధీజీకి విధేయునిగానేవ్ఞన్నారు.సత్యం,అహింస సమరాయుధాలుగా శాంతియుతంగా స్వాతంత్య్రం సాధించాలనే పోరాటంలక్ష్యంతోగాంధీజీ రక్తపాతంలేని శాంతియుత సమరాన్ని నడిపించారు. నేతాజీ,బాపూజీలు రగిలించిన స్వాతంత్య్ర సమ రాగ్నిబాటలో ఎందరో గాంధేయవాదులు,విప్లవ వీరులు, సమర యోధులు ఆఖరి రక్తపుబొట్టువరకు ధారపోసి స్వాతంత్య్రజ్యోతి వెలిగించారు.
నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జీవన చరమఘట్టంనేటికీ మిస్టరీగా మిగిలిపోయింది.ఆయనకు జయంతి తప్ప వర్ధంతి సందర్భం చరిత్రలో నిక్షిప్తమైంది.ద్వితీయ ప్రపంచసంగ్రామంలో విధి వక్రీరించి జపాన్,జర్మనీ,ఇటలీ పక్షాలు ఘోరపరాజయానికి పాల్పడటంతో, ఆజాద్ హింద్‌ఫౌజ్‌కు మృత్యుపాశమైంది.
నేతాజీ సారధ్యంలో ఆఖరి రక్తబొట్టు వరకు వీర సేనావాహినిపోరాడి అమర చరిత్రసృష్టించింది. స్వాతంత్య్రా నంతరం భారత ప్రభుత్వం, లైహోకు విమాన ప్రమాదంలో సుభాష్‌చంద్రబోస్ అంతిమఘట్టంపై మరణం ధృవీకరించబడ లేదు. ఏదిఏమైనా నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మృతిలేని మహానేతగా భారత ప్రజహృదయాల్లో నిరంతర సజీవులు.
_జయసూర్య, (రచయిత: సీనియర్ జర్నలిస్టు)
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/