సేద్యానికి ప్రమాదం.. వ్యవసాయ చట్టాలు!

కార్పొరేట్‌ సంస్థల్లో రైతులు బందీ ఖాయం

Indian Agriculture
Indian Agriculture

రైతుల ఆందోళనలను ఏమాత్రం పట్టించుకోకుండా మోడీ ప్రభుత్వం వ్యవసాయానికి సంబంధించిన మూడు బిల్లులను ఉభయసభల్లో ఆమోదించుకొంది.

రాజ్యసభలో ఓటింగ్‌ జరపకుండా గందరగోళం మధ్య మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈబిల్లులు ప్రవేశపెట్టడం ద్వారా మోడీ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు బట్టబయలైనాయి.

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని వారి జీవన ప్రమాణాలు పెరుగుతాయని, రైతుల ప్రయోజనాలకే ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన మాటలు గారడీయేనని తేటతెల్లమైంది.

1955లో చేసిన ఈ చట్టం వ్యాపారులుగానీ, కంపెనీలుగాని ఆహార ధాన్యాలను ఇతర వ్యవసాయోత్పత్తులను ఎంత పరిధిలో నిల్వ చేసుకోవచ్చు.

వాటి ధరలను ఎలా నిర్ణయించవచ్చు అన్న విషయాలపై అదుపును ప్రభుత్వానికి కల్పించింది.

నిల్వ చేయదగిన, ఆహార ఉత్పత్తులకు 50 శాతం ధరలు పెరిగితే, ఉద్యానవన పంటలకు నూరుశాతం ధరలు పెరిగితేనే వాటిని అదుపు చేయడానికి మాత్రమే ప్రభుత్వం పూనుకొంటుంది.

ఆ పరిస్థితి లేనప్పుడు ఎటువంటి నియంత్రణ విధించదు. చట్టంలో చేసిన కొత్త సెక్షన్‌ ప్రకారం పరిమితి లేకుండా ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు.

ఇది బడా వ్యాపారులకు, భూస్వాములకు ప్రయోజనకరమైంది. రైతాంగానికి నష్టదాయకమైంది.

వ్యాపారులు తక్కువ ధరకు ధాన్యాన్ని, ఇతర వస్తువ్ఞలను కొని నిల్వ చేసుకోవచ్చు. ధర పెరిగాక వీరికి కొనాల్సిన అవసరం ఉండదు. చిన్న రైతులు పంట చేతికి రాగానే అమ్ముకోకతప్పదు.

వేచిచూద్దా మన్నా సిండికేట్‌ వ్యాపారులు ధర పెరగనివ్వరు.

వ్యవసాయోత్ప త్తుల నిల్వలపై, ధరలపై నిబంధనలు తొలగించడమంటే బడా వ్యాపారులు అధిక నిల్వలు చేసి, కృత్రిమ కొరత సృష్టించి, వారి ఇష్టానుసారం ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వటమే.

నిత్యావసర చట్టంలో మార్పులు చేయకముందే ఉల్లిపాయల ధర విషయంలో చాలాసార్లు ఇలాగే జరిగింది.

భారతదేశంలో 20 కోట్లకుపైగా ఒంటిపూట పస్తులుంటున్నారు. చట్టంలో చేసిన మార్పులు వారిని మరింత కష్టాల పాలు చేస్తుంది.

1961లో 73.4కిలోల తలసరి వార్షిక బియ్యం లభ్యత ఉంటే 2019లో 69.1 కిలోలలకు తగ్గిందని కేంద్ర వ్యవసాయశాఖ నివేదిక వెల్ల డించింది.

1956లో పప్పుధాన్యాల సగటు లభ్యత 25.7 కిలోలు ఉండగా, 2019 నాటికి 17.5 కిలోలు ఉన్న పడిపోయింది.

కోటిన్నర టన్నుల వంట నూనె దిగుమతి ప్రతి సంవత్సరం 70వేల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం.

1965 నుండి 2019 వరకు ఒక మనిషి తీసుకునే ఆహార ధాన్యాల పెరుగుదల 26 గ్రాములు మాత్ర మే. 1965తో పోలిస్తే ప్రజలు రోజుకి 14 గ్రాములు వీటిని తక్కువ తీసుకుం టున్నారు.

రుతు పవనాలు సక్ర మంగా రాకపోయినా, కరవు పరిస్థితి ఏర్పడినా 20 కోట్ల మంది ప్రజలు ఆకలి కష్టాల్లోకి నెట్టబడతారు.

దేశంలో స్వేచ్ఛా వాణిజ్య చట్టంలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లు, అమ్మకాలను పూర్తి ధ్వంసం చేస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో రైతులు వ్యవసాయ మార్కెట్‌ కమిటీల ద్వారా లైసెన్సు పొందిన వ్యక్తులకు గాని కమిషన్‌ ఏజెంట్లకుగాని విక్రయించేవారు. కొనుగోలు ధరలో ఒక శాతం రుసుం వ్యవసాయ యార్డులు చెల్లించేవారు.

దేశవ్యాప్తంగా 2477 ప్రధాన మార్కెట్‌ యార్డులు 4843 అనుబంధ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. వీటి ప్రధాన ఉద్దేశం బడా వ్యాపారులనుండి రైతాంగాన్ని రక్షించటమే.

అంతే కాకుండా ఆహార ధాన్యాల సేకరణకు ప్రభుత్వ కేంద్రాలుగా కూడా ఉన్నాయి.

రైతులు స్వేచ్ఛగా తమ ఇష్టానుసారమైన ధరలకు పంటలు అమ్ముకోవచ్చని,మార్కెట్‌ యార్డుల్లో రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని ఇది ఎంతో ప్రయోజనమైందని కేంద్ర ప్రభుత్వం చెప్పటం రైతాంగాన్ని మోసగించడమే.

దేశంలో 80 శాతంపైగా చిన్న రైతులు ఉన్నారు. వారు సుదీర్ఘ ప్రాంతాలకు పంటలు తీసుకెళ్లి అమ్మకోలేరు. అందుకు అయ్యే రవాణా ఛార్జీలు భరించలేరు. ఒకవేళ తీసుకెళ్లినా ఎక్కువ ధర వస్తుందనే నమ్మకం లేదు.

సిండికేట్‌ వ్యాపారులు ఇవ్వరు. మార్కెట్‌ యార్డుల్లో రుసుం చెల్లించకపోవడం వలన వాటికి ఆదాయం లేక మూతపడతాయి.

ఫలితంగా బడా వ్యాపా రులు తమ ఇష్టానుసారం పంటలను కొనుగోలు చేసి రైతులను, వినియోగదారులను దారుణంగా కోసుకుంటారు.

స్వేచ్ఛావాణిజ్యం పేరుతో కేంద్రప్రభుత్వం పంటలకు మద్దతు ధరలు ప్రకటన విరమించుకొనే అవకాశం ఉంది.

మద్దతు ధరలు ప్రకటించినా, ఆ ధరలకు వ్యాపారులు కొనటం లేదు.రాష్ట్రంలో మొక్కజొన్న,జొన్న పంటలను మద్దతు వారికన్నా చాలా తక్కువగా కొంటున్నారు.

అయినా ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. స్వేచ్ఛా వాణిజ్యం ద్వారా బడా వ్యాపారులు పంటల ధరలను మరింతగా తగ్గించినా వారిపై ఎటువంటి చర్యలు ఉండవు.

ఈ ఒప్పందం వలన భవిష్యత్తులో పంటల ధరలు తగ్గే ప్రమాదం ఏర్పడుతుంది.

సాగు స్పాన్సర్‌ చేసే కంపెనీలు తమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచు కొని ధర నిర్ణయిస్తాయి. తమ లాభాలను దృష్టిలో పెట్టుకొని కంపెనీలు కొన్ని తరహా పంటలే వేయాలని రైతులపై ఒత్తిడి చేస్తాయి.

ఇప్పటికే కొన్ని చోట్ల ఉన్న కాంట్రాక్టు సేద్యం ఒప్పం దాలను కంపెనీలు ఉల్లంఘించాయి. దాని వలన రైతులు తీవ్రంగా నష్టపోయారు.

చట్టం అమల్లోకివస్తే కార్పొరేట్‌ సంస్థల హస్తాల్లో రైతులు బంధించబడతారు.

అంతిమంగా కొత్తగా చేసిన వ్యవ సాయ చట్టాలు, రైతులను భూముల నుండి గెంటివేసి కార్పొరేట్‌ సంస్థలకు, కాంట్రాక్టు సేద్యానికి అప్పగించడం జరుగుతుంది.

రైతులు ఆ సంస్థల వద్ద కూలీలుగా, పట్టణాల్లో అపార్టమెంట్ల వద్ద వాచ్‌మెన్‌లుగా అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలవైపునకు నెట్టబడతారు.

  • బొల్లిముంత సాంబశివరావు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/