బైడెన్‌ జీవితంలో వింతలు, విషాదాలు!

‘వార్తల్లోని వ్యక్తి’ (ప్రతిసోమవారం)

Joe Biden

కొన్ని జీవితాలు విచిత్రంగా ఉంటాయి. అలాంటి వాటిలో వచ్చే నెల అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న జోబైడెన్‌ది ఒకటి.

సామాన్యుల జీవితాలు ఎగుడు దిగుడుగా ఉండడం సహజం. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ జీవితమే చూడండి.

ఆయన ఏ చిన్న వేదిక ఎక్కినా ‘ఆశ ఎప్పుడూ చావదు, ఆశ ఎప్పుడూ చిగురిస్తూనే ఉంటుంది అంటారు.

ఆయన మృదుస్వభావి. ఆశాభావాన్ని ఎప్పుడూ కోల్పోరు. కాని జీవితంలో ఎన్ని ఢక్కామొకీలు తిన్నారో చూడండి!

ఆయన 1972లో తొలిసారిగా అమెరికా నెనెట్‌కు ఎగువసభకు పోటీ చేశారు, గెలిచారు. అలా ఎన్నికైన వారిలో ఆయన రెండవ వారు. అప్పటిలో డెమొక్రాటిక్‌ పార్టీ ఆశాజ్యోతిగా ఆయనకు పేరొచ్చింది.

ప్రమాణ స్వీకారం చేయడానికి వాషింగ్టన్‌లోఉండి పోగా , ఇక్కడ స్వస్థలం డెలావర్‌లో ఆయన భార్య నీలియా, కుమార్తె రోడ్డు ప్రమాదంలో దారుణంగా మృతి చెందారు. ఇద్దరు కుమారులు తీవ్రంగా గాయపడ్డారు.

29 ఏళ్లకే…

అప్పటికి ఆయన వయస్సు 29! కుమారుల మంచాల ప్రక్కనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నిరాశోపహతుడై ఊరిలోని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు!

కాని, చిన్న పిల్లలను చూసేదెవరు? వారికి దిక్కేది? ఒకప్రక్క తల్లి లేదు. సన్యాసం పుచ్చుకుందామా? అన్న ఆలోచన! అయిదేళ్ల లోపు ఇద్దరు పసికందులకు దిక్కెవరు?

నత్తి రాజకీయవేత్త:

బైడెన్‌కు చిన్నప్పటి నుంచి నత్తి. తోటి విద్యార్థులు, టీచర్లు ఆయనను ‘బైబై బైబైడెన్‌ అంటూ ఎద్దేవా చేసేవారు.

మొత్తం మీద తండ్రి ప్రోత్సాహంతో పుస్తకాలు చదివి, అక్షరాలను అద్దంలో చూసి నానాతిప్పలు పడి, నత్తిని జయించాడు బైడెన్‌.

డెమోస్తనీస్‌తో ఈ సందర్భంలో గ్రీక్‌తత్వవేత్త మహోపన్యాసకుడు డెమోస్తనీస్‌ జ్ఞాపకం వస్తాడు.ఆయనకు కూడా చిన్నప్పుడు నత్తి. దాన్ని జయించడానికి ఎవరో ఒక ఉపాయం చెప్పారట.

నోటిలో గులకరాళ్లు పోసుకుని, సముద్రతీరంలో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ పరుగెత్తాలని! అలా చేసే, ఆయన ప్రపంచంలో చరిత్ర కెక్కిన మహోపన్యాకుడైనాడు! అలాగే బైడెన్‌ కూడా పుస్తకాలను బట్టిపట్టి, చివరికి నత్తిని జయించాడు.

పెద్దకొడుక్కి బ్రెయిన్‌ క్యాన్సర్‌:

బైడెన్‌ పెద్ద కొడుక్కి బ్రెయిన్‌ క్యాన్సర్‌ వచ్చింది.చనిపోయే ముందు తండ్రితో ఆయనొక మాటన్నాడు. ‘నాన్నా! నువ్వు అధైర్యపడకు. నీ సద్గుణాలే నిన్ను అధ్యక్షుడుగా ఎప్పటికైనా గెలిపిస్తాయి అంటూ కళ్లు మూశాడు.

ఏమో! చూద్దాం. ఆ క్యాన్సర్‌ రోగి ఆఖరు మాటే నిజమవ్ఞతుందేమో! ట్రంప్‌తో పోలిస్తే బైడెన్‌ అన్ని విధాల అర్హుడైన అభ్యర్థి. ఆయనే గెలవాలని ప్రపంచమంతా కోరుకుంటున్నది.

జోబైడెన్‌ వయస్సు 77 సంవత్సరాలు.

  • డాక్టర్‌ తుర్లపాటి కుటుంబరావు, (‘పద్మశ్రీ’ అవార్డు గ్రహీత)

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/