మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్

భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు మొరంచపల్లి గ్రామాన్ని చుట్టేసాయి. ఇళ్లన్నీ నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ప్రాణాలు అరచేతిలో పట్టుకొని చెట్లు, మేడలు ఎక్కారు. తమను రక్షించాలని కోరడం తో ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించారు సీఎం కేసీఆర్. వెంటనే అధికార యంత్రాంగం అక్కడకు తరలివెళ్లి రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టింది. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మొరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మొరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మొరంచపల్లి గ్రామాన్ని వరద ముంచెత్తింది.