నటుడు విజయకాంత్ కన్నుమూత

తమిళ్ చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ (71) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యల తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. . ఆయన మరణ వార్తతో అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాక్ కు గురవుతున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

గత నెల 18న జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో చెన్నైలోని మియోట్‌ దవాఖానలో చేరారు. చికిత్స అనంతరం కోలుకుని డిసెంబర్‌ 11న ఇంటికి చేరుకున్నారు. అయితే కదలలేని స్థితిలో, చాలా బలహీనంగా కనిపించారు. తాజాగా మళ్లీ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించారు. ఇదే క్రమంలో ఆయనకు కరోనా సోకినట్టు ఈ ఉదయం వైద్య పరీక్షల్లో నిర్ధరాణ అయింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను వెంటిలేటర్ పై ఉంచి, చికిత్సను కొనసాగించారు. అయితే, వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఆరోగ్యం మరింత విషమించి కన్నుమూశారు. విజయకాంత్‌ భౌతికకాయాన్ని ఆయన స్వగృహానికి తరలించి, కాసేపట్లో డీఎండీకే కార్యాలయానికి తరలించనున్నారు.

ఇక ‘కెప్టెన్’ అని విస్తృతంగా పిలువబడే విజయకాంత్ జీవితం తమిళ చిత్ర పరిశ్రమలో విజయవంతమైనదిగా చెప్పవచ్చు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన 154 సినిమాల్లో నటించారు. నడిగర్ సంఘంలో (అధికారికంగా సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (SIAA) అని పిలుస్తారు) హోదాలో ఉన్నప్పుడు, విజయకాంత్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. అతను 2005లో దేశీయ ముర్పోక్కు ద్రవిడ కజ్గం స్థాపించాడు. 2006లో DMDK అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి మొత్తం ఓట్లలో 10 శాతం తక్కువ ఓట్లను సాధించింది. అయితే, పార్టీ వ్యవస్థాపకుడు మినహా అభ్యర్థులెవరూ గెలవలేదు. 2011లో, డీఎండీకే అన్నాడీఎంకేతో పొత్తుతో ఎన్నికలలో పోటీ చేసి, 41 నియోజకవర్గాల్లో పోటీ చేసి, 26 గెలిచింది. విజయకాంత్ 2011-2016 మధ్య తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు.