పలు దేశంలో మంకీపాక్స్ కేసులు ..భారత్ అప్రమత్తం

ఇన్ఫెక్షన్ సోకిన ప్రతి 10మందిలో ఒకరు చనిపోయే అవకాశం

న్యూఢిల్లీ : మంకీపాక్స్ కేసులు అమెరికా, ఐరోపా దేశాల్లో భారీగా పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. మంకీపాక్స్ తొలికేసు బ్రిటన్‌లో బయటపడగా అక్కడి నుంచి అత్యంత వేగంగా స్పెయిన్, పోర్చుగల్, ఇటలీ, స్వీడన్, కెనడా, అమెరికాలకు విస్తరించింది. నిన్న బెల్జియం, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలోనూ కేసులు వెలుగుచూశాయి. బ్రిటన్‌లో మంకీపాక్స్ కేసుల సంఖ్య 20కి పెరగ్గా, స్పెయిన్‌లో ఇప్పటి వరకు 23 కేసులు నమోదయ్యాయి. విదేశాల్లో మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన భారత్.. ఆ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ఐసోలేషన్ చేయాలని, వారి నుంచి నమూనాలను సేకరించి పూణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలోని బీఎస్ఎల్-4కు పంపాలని ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు.

నిజానికి మంకీపాక్స్ అనేది ఇప్పుడే పుట్టుకొచ్చిందేమీ కాదు. 1958లో ప్రయోగశాలలోని కోతుల్లో ఈ వైరస్‌ను కనుగొన్నారు. కాబట్టే దీనికి మంకీపాక్స్ అని పేరు పెట్టారు. ఇది కూడా మశూచి లాంటిదే. మనుషుల్లో తొలి కేసు మాత్రం 1970లో నమోదైంది. ఆ తర్వాత మధ్య, పశ్చిమ ఆఫ్రికాకే ఇది పరిమితమైంది. ఇక లక్షణాల విషయానికి వస్తే.. జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులతో ప్రారంభమై రెండు నుంచి నాలుగు వారాలపాటు ఉంటాయి. అయితే, తాజాగా కేసులు నమోదవుతున్నప్పటికీ మరణాలు సంభవించకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం.

మంకీపాక్స్ సోకిన జంతువు కరిచినా, లేదంటే ఆ ఇన్ఫెక్షన్‌కు గురైన వ్యక్తి రక్తం, శరీర స్రావాలను తాకినా ఇది సోకుతుంది. అలాగే, నోటి నుంచి వెలువడే తుంపర్ల ద్వారా కూడా విస్తరిస్తుంది. ఎలుకలు, ఉడతలు, చిట్టెలుకల ద్వారానూ వ్యాప్తి చెందుతుంది. మంకీపాక్స్ సోకిన జంతువుల మాంసాన్ని సరిగా ఉడికించకుండా తిన్నా ఇది సోకుతుంది. మశూచికి ఇచ్చే టీకాలే దీనిని కూడా నివారిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్‌కు గురైన పది మందిలో ఒకరు చనిపోయే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. కాగా, ఆఫ్రికాతో ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తిలో మంకీపాక్స్ వెలుగు చూడడంతో ఇది శృంగారం ద్వారా కూడా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉందని బ్రిటన్ ఆరోగ్యశాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్పెయిన్, పోర్చుగల్ దేశాల్లోనూ ఈ ఇన్ఫెక్షన్ బారినపడిన వారిలో యువకులే అత్యధికంగా ఉన్నారని, వారు అంతకుముందు లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారని అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/