పాటియాలా సెంట్రల్ జైలు సిద్ధూ తరలింపు

పాటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయిన సిద్ధూ
వైద్య పరీక్షల అనంతరం జైలుకు తరలించిన పోలీసులు

పాటియాలా : పంజాబ్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీంకోర్టు ఏడాది జైలు శిక్షను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం జరిగిన గొడవలో సిద్ధూ కొట్టిన దెబ్బలకు ఒక వ్యక్తి మృతి చెందాడు. దీనికి సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఆయనకు శిక్షను విధించింది. ఈ నేపథ్యంలో, నిన్న ఆయన పాటియాలా జిల్లా కోర్టులో లొంగిపోయారు. తన నివాసం నుంచి దుస్తుల బ్యాగును తీసుకుని కోర్టుకు వెళ్లారు.

నిబంధనల ప్రకారం సిద్ధూను కోర్టు నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు పూర్తయిన వెంటనే పోలీసు జీపులో పాటియాలా సెంట్రల్ జైలుకు తరలించారు. మరోవైపు తనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, లొంగిపోవడానికి కొన్ని వారాల సమయం ఇవ్వాలంటూ నిన్న సుప్రీంకోర్టులో సిద్ధూ పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం… ప్రత్యేక బెంచ్ ఈ తీర్పును వెలువరించిన నేపథ్యంలో తాము నిర్ణయం తీసుకోలేమని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి ముందు పిటిషన్ ను సమర్పించాలని… ఆయన ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పింది. ఈ నేపథ్యంలోనే, సిద్ధూ కోర్టులో లొంగిపోయారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/