డొనాల్డ్ ట్రంప్ ను కడతేర్చడమే తమ లక్ష్యం: ఇరాన్ హెచ్చరిక

దీర్ఘశ్రేణి క్షిపణిని తయారుచేసినట్లు వెల్లడించిన కమాండర్

‘We’re looking to kill Trump…’: Iran Commander warns to avenge Soleimani killing

టెహ్రాన్: ఇరాన్ సైన్యం రివల్యూషనరీ గార్డ్స్ చేతికి మరో దీర్ఘ శ్రేణి క్షిపణి అందింది. దీని రేంజ్ 1,650 కిలోమీటర్లని టాప్ కమాండర్ శుక్రవారం వెల్లడించారు. పాశ్చాత్య దేశాల హెచ్చరికల నేపథ్యంలో ఈ క్షిపణి తమ సైన్యానికి బలం చేకూర్చుతుందని ప్రకటించారు. అయితే, సాధారణ సైనికులను చంపేందుకు ఈ క్షిపణిని ఉపయోగించబోమని, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ లక్ష్యమని రివల్యూషనరీ గార్డ్స్ టాప్ కమాండర్ అమిరాలి హజీజాదె తెలిపారు. ఈమేరకు ఇరాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హజీజాదె మాట్లాడారు.

2020లో ఇరాక్ లోని బాగ్దాద్ లో డ్రోన్ ద్వారా దాడి చేసి ఇరాన్ మిలటరీ కమాండర్ క్వాసిం సొలెమనిని అమెరికా బలగాలు మట్టుబెట్టాయి. దీనిపై ఇరాన్ సైన్యం గుర్రుగా ఉంది. తమ కమాండర్ ను చంపేసిన అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని పలుమార్లు హెచ్చరించాయి. అప్పటి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ను కడతేర్చడమే తమ లక్ష్యమని హజీజాదె తాజాగా ప్రకటించాడు. ‘దేవుడి ఆదేశం మేరకు మేం ట్రంప్ ను చంపేస్తాం. సొలెమనిని చంపేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన మైక్ పాంపియోతో పాటు ఇతర మిలటరీ కమాండర్లను కూడా తుదముట్టిస్తాం’ అంటూ టీవీ ఇంటర్వ్యూలో హజీజాదె హెచ్చరించాడు.