యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను పరామర్శించిన మోహన్ బాబు

సినీ నటుడు మోహన్ బాబు శనివారం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ను పరామర్శించారు. రీసెంట్ గా యార్లగడ్డ తన మాతృమూర్తిని కోల్పోయారు. ఈ తరుణంలో మోహన్ బాబు..యార్లగడ్డ ను పరామర్శించారు. ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం పలికారు అభిమానులు. ఐతే ఆత్మీయులను కలిసేందుకే విజయవాడ వచ్చానని..ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారాయన. అక్కడి నుండి పెదపారుపూడి మండలం వానపాముల గ్రామంలోని యార్లగడ్డ నివాసానికి మోహన్ బాబు చేరుకున్నారు. ఆయన తల్లి రంగనాయకమ్మ విగ్రహానికి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులందరిని పరామర్శించారు. లక్ష్మీప్రసాద్ కు మోహన్ బాబు అత్యంత సన్నిహితుడు. వీళ్లిద్దరిదీ దాదాపు ఐదు దశాబ్దాల అనుబంధం. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ యార్లగడ్డ తనకు అత్యంత ఆప్తుడని చెప్పారు. ఆయన తల్లిని కోల్పోవడం తనను కలచి వేసిందని అన్నారు.

ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు మోహన్ బాబు ..ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిసే అవకాశం ఉందని అంటున్నారు. గత కొంతకాలంగా మోహన్ బాబుకు సీఎం జగన్ కీలక పదవి ఇస్తారని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ దిశగా అడుగులు ముందుకు పడటం లేదు. ఇక ఇటీవల మోహన్ బాబు తనయుడు ‘మా’ అధ్యక్షుడిగా గెలిచి బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల సినిమాల విషయంలో కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం చేయాలని నిర్ణయించారు. బెనిఫిట్ షోలను రద్దు చేశారు. కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. మరి జగన్ ను ఒకవేళ మోహన్ బాబు కలిస్తే ఆ విషయాల గురించి ఏమైనా మాట్లాడతారేమో చూడాలి.