మ‌మ‌తాబెన‌ర్జీ స‌మావేశానికి ఆహ్వానించినా వెళ్లం

తనకు ఆహ్వానం అందలేదన్న ఒవైసీ
తమ పార్టీ గురించి టీఎంసీ దారుణంగా మాట్లాడిందని వ్యాఖ్య

హైదరాబాద్: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో విపక్ష నేతలతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమావేశాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, మమత సమావేశానికి తనను ఆహ్వానించలేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఒకవేళ తనకు ఆహ్వానం అందినా… ఆ సమావేశానికి తాను హాజరయ్యేవాడిని కాదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి ఒక కారణమని అన్నారు. కాంగ్రెస్ ను ఆహ్వానించారు కాబట్టి… ఆ సమావేశానికి తాము వెళ్లమని చెప్పారు. మమత పార్టీ టీఎంసీ తమ పార్టీ గురించి చాలా దారుణంగా మాట్లాడిందని… అలాంటప్పుడు వారి సమావేశానికి ఎలా హాజరవుతామని ఒవైసీ అన్నారు.

మొత్తం 19 రాజకీయ పార్టీల నేతలను సమావేశానికి మమత ఆహ్వానించారు. వీరిలో విపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, నవీన్ పట్నాయక్, పినరయి విజయన్, హేమంత్ సోరెన్, స్టాలిన్, ఉద్ధవ్ థాకరే ఉన్నారు. ఈ సమావేశానికి జగన్ ను ఆహ్వానించకపోవడం గమనార్హం. మరోవైపు, ఈ సమావేశానికి కేసీఆర్, కేజ్రీవాల్ దూరంగా ఉన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/