‘పీఎం కేర్స్​ ఫర్​ చిల్డ్రన్​’ పథకానికి శ్రీకారం చుట్టిన మోడీ

కరోనా మహమ్మారి బాధిత అనాథ పిల్లల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్‌ను సోమవారం ప్రారంభించారు. కరోనా సమయంలో ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయారు. వారందరిని అన్ని విధాలా ఆదుకుంటామని గత ఏడాది ప్రకటించిన ప్రధాని మోదీ.. తాజాగా ఆ పథకాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరు వారితోనే ఉన్నారనే భరోసాను కల్పిస్తుందన్నారు. ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఈ పధకానికి శ్రీకారం చుట్టారు.

ఈ పథకం కింద పాఠశాలలకు వెళ్లే అనాథ పిల్లలకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నారు. అనాథ పిల్లల కోసం పీఎం కేర్స్ పాస్‌బుక్, ఆయుష్మాన్ భారత్, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద హెల్త్ కార్డ్‌ని ఈ కార్యక్రమంలో పిల్లలకు అందజేస్తామని ప్రధానమంత్రి తెలిపారు. కరోనా సమయంలో ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలతో పాటు వెంటిలేటర్ల కొనుగోలు, ఆక్సీజన్ ప్లాంట్ల ఏర్పాటుకు పీఎం కేర్స్ నిధులు ఎంతో ఉపయోగపడ్డాయి. వాటి వల్ల ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోగలిగాం. ఐనప్పటికీ కొంత మంది మరణించారు.

ఇప్పుడు వారి పిల్లల కోసం పీఎం కేర్స్ నిధులను ఉపయోగిస్తున్నాం. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలుసు. కరోనా సమయంలో తల్లిదండ్రులను కోల్పోయిన వారి కోసం పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకాన్ని తీసుకొచ్చామన్నారు. 18-23 ఏళ్ల వయసుండి ఉన్నత విద్య చదివే వారికి ప్రతి నెలా స్టైపండ్ , 23 ఏళ్లు వచ్చాక రూ.10 లక్షలను అందిస్తాం అని మోడీ తెలిపారు. ఈ పథకం పొందడానికి కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ ఆన్‌లైన్ పోర్టల్‌లో కొవిడ్ బాధిత అనాథ పిల్లలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.