నేనేమైనా తక్కువ అర్హత కలిగి ఉన్నానా? : నగ్మా ఆగ్రహం

తన తపస్సులో ఏదైనా తగ్గి ఉంటుందేమోనన్న పవన్ ఖేరా

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 10 మంది అభ్యర్థుల జాబితా ఆ పార్టీలో చిచ్చు రేపుతోంది. రాజ్యసభ సీటు ఆశించి భంగపడిన కొందరు సీనియర్ నేతలు ట్విట్టర్ వేదికగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. రాజ్యసభ సీటును ఆశించిన ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా, కాంగ్రెస్ ముంబై యూనిట్ ఉపాధ్యక్షురాలు, నటి నగ్మా కూడా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘నా తపస్సులో ఏదైనా తగ్గి ఉంటుందేమో’’ అని పవన్ ఖేరా ట్వీట్ చేయగా, ఆయన ట్వీట్‌కు నగ్మా స్పందించారు.

మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ ఎంపిక చేసిన ఇమ్రాన్ ప్రతాప్ గర్హిని ఉద్దేశించి.. తన 18 ఏళ్ల తపస్సు కూడా ఇమ్రాన్ భాయ్ ముందు తక్కువైందని నగ్మా వాపోయారు. 2003-04లో తాను కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు తనను రాజ్యసభకు పంపుతానని పార్టీ చీఫ్ సోనియా గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటికి 18 ఏళ్లు గడిచిపోయాయని, ఇన్నేళ్లలో వారు తనకు ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్‌ను ఎంపిక చేశారని అన్నారు. ‘‘నేనేమైనా తక్కువ అర్హత కలిగి ఉన్నానా?’’ అని ఆమె ప్రశ్నించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/