మోడీ మళ్లీ సీఎం కావాలి – నీతీశ్‌

రాజకీయ ప్రసంగాల్లో అప్పుడప్పుడు నేతలు మాట్లాడేటప్పుడు పొరపాట్లు దొర్లుతుంటాయి. తాజాగా బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ పొరపాటుగా ఒక వ్యాఖ్యానం చేసి, నలుగురిలో నవ్వులపాలయ్యారు. మోడీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. అధికార ఎన్డీయే తరఫున ఆదివారం పట్నాలో ప్రచారం చేసిన ఆయన ఈ వ్యాఖ్య చేశారు.

”మేం (ఎన్డీయే) దేశవ్యాప్తంగా 400కుపైగా స్థానాల్లో గెలవాలని, మోడీ మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాను. అప్పుడే భారత్‌ అభివృద్ధి చెందుతుంది. బిహార్‌ అభివృద్ధి చెందుతుంది. ప్రతిదీ జరుగుతుంది” అని నీతీశ్‌ పేర్కొన్నారు. అక్కడే ఉన్న నేతలు అప్రమత్తం చేయడంతో ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని సరిచేసుకున్నారు. మోదీ మరోమారు ప్రధాని కావాలన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు.

గతంలోనూ సీఎం నితీష్ కుమార్ ఇలా పలుమార్లు నోరు జారారు. వైశాలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి వీణా దేవికి మద్దతుగా ప్రసంగిస్తూ, బీహార్‌లోని 40 స్థానాల్లో ఎన్‌డీఏ గెలవాలని కోరుకుంటున్నానని, మన కూటమి దేశం మొత్తం మీద నాలుగు వేల సీట్లు గెలవాలని అభిలషిస్తున్నానని అన్నారు.