ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డ ప్రధాని మోడీ

2024 లోక్‌సభ ఎన్నికలలో బిజెపిని గద్దె దించడమే లక్షంగా బెంగళూరులో సమావేశమైన 26 ప్రతిపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ప్రధాని మోడీ విరుచుకపడ్డారు. కుటుంబ పాలన, అవినీతిపైనే ప్రతిపక్షాల దృష్టంతా అని మోడీ అన్నారు. అండమాన్, నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌లో వీర్ సావర్కర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన నూతన టెర్మినల్ బిల్డింగ్‌ను మంగళవారం ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. పోర్ట్ బ్లెయిర్‌లో విమానాశ్రయాన్ని సందర్శించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎయిర్‌పోర్టు ప్రాంగణంలో వీర్ సావర్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..గత 75 ఏళ్ల స్వాతంత్య్రంలో అవినీతి, దొరల పార్టీలు దేశానికి అన్యాయం చేశాయని ప్రతిపక్షాల ఐక్యతపై ప్రధాని మోడీ మండిపడ్డారు. 2024లో బీజేపీని తిరిగి తీసుకురావాలనే ఆలోచనలో దేశ ప్రజలు ఉన్నారని తెలిపారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు మళ్లీ తమ దుకాణాన్ని తెరిచాయన్నారు. విపక్షాల ఐక్య సమావేశంలో 2024కి 26 పార్టీలు వచ్చాయని అన్నారు. ఈ పార్టీలు తమ దుకాణాల్లో ‘కులతత్వం, అవినీతి’ అనే రెండు వస్తువులను అమ్ముకుంటున్నాయని, ఇప్పుడు వారంతా బెంగళూరులో సమావేశమయ్యారని అన్నారు. గత ప్రభుత్వంతో పోల్చితే తమ ప్రభుత్వం అండమాన్, నికోబార్ దీవుల అభివృద్ధికి రెండింతలు ఖర్చు చేసిందని తెలిపారు. దేశంలోని ద్వీపాలలో పెరిగిన పర్యాటకం మరిన్ని ఉపాధి అవకాశాలకు సూచన అని మోడీ తెలిపారు. గతంలో స్వార్థ రాజకీయాల వల్ల మన అంతర్గత ప్రాంతం, ద్వీప ప్రాంతాలకు అభివృద్ధి పనులు జరగలేదన్నారు. తమ ప్రభుత్వ అభివృద్ధి పనులు కూడా దీవుల పర్యాటకానికి దోహదపడ్డాయని ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.