తిరుమల తిరుపతి దేవస్థానికి నారాయణమూర్తి దంపతులు భారీ విరాళం
టీటీడీకి బంగారు శంఖం, తాబేలు విరాళం

తిరుమలః కలియుగ దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారికి ఇన్‌ఫోసిస్ చైర్మెన్ నారాయణమూర్తి, ఆయన భార్య సుధా మూర్తి .. భారీ విరాళం ఇచ్చారు. బంగారు శంఖం, బంగారు తాబేలును టీటీడీకి విరాళంగా సమర్పించారు. ఆ కానుకలను ఆదివారం జూలై 16వ తేదీన అందజేశారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి రంగనాయక మండపంలో అందజేశారు. ఆ రెండు బంగారు కానుకల బరువు సుమారు రెండు కిలోలు ఉంటుంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు ఎస్ రాజీవ్ కృష్ణ ఆ కానుకలకు చెందిన ఫోటోలను షేర్ చేశారు.
ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఆ పిక్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గౌరవనీయులైన ఆ జంట తమ ఆదరాభిమానాలను ప్రదర్శిస్తున్నట్లు మెచ్చుకున్నారు. తమ ఛారిటీ కార్యక్రమాలతో లక్షలాది మందిని ఆదుకుంటున్న ఆ జంట.. తమను దీవిస్తున్న ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ఉందని నెటిజన్స్ అన్నారు. టీటీడీకి గత అయిదేళ్లలో సుమారు 880 కోట్లు కానుకల రూపంలో వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. 10 వేలు విరాళం ఇచ్చిన వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శన్ సౌకర్యాన్ని కల్పిస్తున్న విషయం తెలిసిందే.