బంగారిగడ్డ‌ సభలో బిజెపి ఫై నిప్పులు చెరిగిన కేసీఆర్

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆదివారం చండూరు మండలం బంగారిగడ్డ‌లో నిర్వహించిన టిఆర్ఎస్ సభలో కేంద్రం ఫై మరోసారి సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. అరాచక, కిరాచక రాజకీయాలు చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ.. రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడు చైతన్యవంతమైన గడ్డ అనీ, ఆలోచనలేకుండా గాలికి ఓటు వేయొద్దని సూచించారు.

‘ఎన్నో ప్రకృతి వనరులు, సంపదలు ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా?, రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు అని నిలదీశారు కేసీఆర్‌. ధరల పెరుగుదలకు కారణం ఎవరు? సిలిండర్‌ రూ.1200 చేసింది ఎవడు? పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచెంది ఎవడు? మండిపడ్డ ఆయన.. ధరలు పెంచిన బీజేపీకి మళ్లీ ఓటు వేయాలా? అని ప్రశ్నించారు. అంత పౌరుషం లేకుండా ఉన్నమా? ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అర్థమై తర్వాత కూడా.. కానట్టు చేస్తే మన బతుకులు వ్యర్థం అవుతాయని హెచ్చరించారు.

మునుగోడులో చేనేత కార్మికులు ఉన్నారు. దేశంలో ఏప్ర‌ధాని కూడా చేయ‌ని దుర్మార్గం మోడీ చేసిండు. ఇబ్బందుల్లో ఉన్న చేనేత‌పై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారు. ఏ విధంగా చేనేత బిడ్డ‌లు బీజేపీకి ఓటు వేయాలి. ఆలోచించాలి. నాకే ఓటు వేయ్ అని అడ‌గ‌డం ధ‌ర్మ‌మేనా? అని కేసీఆర్ ప్రశ్నించారు. మన రాష్ట్రంలో త‌ప్పా ఎక్క‌డా కూడా 24 గంట‌ల విద్యుత్ ఇవ్వ‌డం లేదు. కార్పొరేట్ల జేబులు నింపేందుకు బీజేపీ య‌త్నిస్తోంది. ప్ర‌యివేటీక‌ర‌ణ అనే పాల‌సీని బీజేపీ అవలంభిస్తోంది. ఇది ఎంత వ‌ర‌కు క‌రెక్ట్. విద్యుత్ సంస్క‌ర‌ణ‌ల పేరిట విద్యుత్ మీట‌ర్లు పెడుతామ‌ని చెబుతున్నారు. మీట‌ర్ల‌కు ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేదు. మీట‌ర్ల‌ను పెట్టుకుని కొంప‌ల‌ను పొగొట్టుకుందామా? ఈ విష‌యంపై ఆలోచించాలి. ఎన్నిక‌ల్లో చేసే దుర్మార్గ‌పు ప్ర‌లోభాల‌కు ఆశ ప‌డితే గోస ప‌డుతామ‌ని కేసీఆర్ పేర్కొన్నారు.