బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు అప్డేట్స్ : మూడో రౌండ్ లో వైసీపీ ఆధిక్యం

బద్వేల్ ఉప ఎన్నిక పోలింగ్ ఓట్ల లెక్కింపు మొదలైంది. బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదటి రౌండ్ నుండి కూడా అధికార పార్టీ వైసీపీ దూకుడు కనపరుస్తుంది.

ఓట్ల లెక్కింపు కోసం గురుకుల పాఠశాలలో 4 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 7 టేబుళ్ల చొప్పున 28 టేబుళ్లను అందుబాటులో ఉంచారు. 10 లేదా 12 రౌండ్లలో మొత్తం ఫలితాలు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం వరకు లెక్కింపు పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. బద్వేలు నియోజకవర్గం 7 మండలాల్లోని 281 కేంద్రాల్లో అక్టోబరు 30న పోలింగ్ జరగ్గా.. 68.37 శాతం ఓటింగ్ నమోదైనట్లు రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్ తెలిపారు. మెుత్తం 15 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా వైకాపా, భాజపా, కాంగ్రెస్ మధ్యే పోటీ నెలకొంది. వైకాపా నుంచి దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ సుధ, భాజపా నుంచి పనతల సురేశ్, కాంగ్రెస్ నుంచి కమలమ్మ పోటీలో ఉన్నారు.