అవినీతిలో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే – ప్రధాని మోడీ

Modi will participate in the election campaign in AP on 7th and 8th of this month

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోడీ..ఈరోజు కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండిసంజయ్ కి మద్దతుగా వేములవాడ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ..కాంగ్రెస్ , బిఆర్ఎస్ లపై నిప్పులు చెరిగారు. ‘అంబేడ్కర్ SC, ST, బీసీలకు ఇచ్చిన రిజర్వేషన్లను కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది. వాటిని తన ఓటు బ్యాంక్ అయిన ముస్లింలకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అలాగే మాదిగలకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని కాంగ్రెస్ అడ్డుకుంటోంది’ అని అన్నారు. ‘RRR సినిమాకు లైఫ్ టైమ్ కలెక్షన్స్ రూ.1,000 కోట్లు వచ్చాయి. కానీ తెలంగాణలో RR ట్యాక్స్ 3, 4 నెలల్లోనే రూ.1,000 కోట్లు దాటేసింది. దీని నుంచి తెలంగాణకు విముక్తి కల్పించాలి. డబుల్ Rలో ఒక R తెలంగాణలో దోచుకుని, ఢిల్లీలో ఉన్న మరో Rకు అందిస్తోంది’ అని ఎద్దేవా చేశారు.

ఇన్నాళ్లూ అంబానీ, అదానీ అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత ఎందుకు వాళ్ల గురించి మాట్లాడటం లేదని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘ఆ యువరాజు(రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) పొద్దున లేస్తే అంబానీ, అదానీ అని మాట్లాడేవాడు. మరి ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నాడు. వారి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంత తీసుకుంది? గుట్టలకొద్దీ డబ్బుల కట్టల గురించి ఆ పార్టీ సమాధానం చెప్పాలి’ అని మోదీ డిమాండ్ చేశారు.

కాళేశ్వరం అవినీతిపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్.. ఇప్పుడెందుకు విచారణ జరపట్లేదని ప్రధాని మోదీ విమర్శించారు. ‘అవినీతిలో BRS, కాంగ్రెస్ పార్టీల మధ్య తేడా లేదు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు BRS అవినీతి గురించి మాట్లాడింది. ఇప్పుడు దర్యాప్తు చేయట్లేదు. ఓటుకు నోటు కేసులో చిక్కిన కాంగ్రెస్ నాయకులపై ఇప్పటివరకు దర్యాప్తు లేదు. ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు’ అని మోదీ విమర్శించారు.

ఇక బీజేపీకి నేషనల్ ఫస్ట్ అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ఫ్యామిలీ ఫస్ట్ అని మోడీ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలను అవినీతే కలుపుతోంది. తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నుంచి కాపాడాలి. మాజీ ప్రధాని పీవీ నరసింహరావును కాంగ్రెస్ అవమానించింది. చివరికి ఆయన పార్థివదేహాన్ని తమ పార్టీ ఆఫీస్లోకి రానివ్వలేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

‘ఇప్పటివరకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలో ఇండియా కూటమికి పరాభవమే ఎదురైంది. మూడో ఫేజ్లో వారి ఫ్యూజ్ ఎగిరిపోయింది. మిగిలిన 4 విడతల్లోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ విజయం ముందే నిర్ణయమైంది’ అని మోదీ తెలిపారు.