ఢిల్లీ లిక్కర్ స్కామ్ : ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మంగళవారం బుచ్చిబాబును హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు వెంటనే అతన్ని ఢిల్లీ తరలించారు. గతంలో బుచ్చిబాబు ఇంట్లో సీబీఐ సోదాలు జరపగా.. ఢిల్లీకి పిలిపించి పలుమార్లు ప్రశ్నించింది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్ చేయడం ఈ కేసులో కీలకంగా మారింది.

బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, అరబిందో గ్రూప్ మాజీ ఛైర్మన్ పి శరత్ రెడ్డితో సహా హైదరాబాద్‌లోని పలువురు ప్రముఖుల దగ్గర ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా పనిచేశారు. గోరంట్ల బుచ్చిబాబు పేరుమీద గోరంట్ల, అసోసియేట్స్, శ్రీ ఎంటర్‌ప్రైజెస్, కోజెంట్ ప్రొఫెషనల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఉన్నాయి.

ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. అతను హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారన్న ఆరోపణలతో సీబీఐ బుచ్చిబాబును అదుపులోకి తీసుకుంది. ఆయన అరెస్ట్‌తో కవితకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవని ప్రచారం సాగుతోంది. కవితకు అత్యంత సన్నిహితుడిగా బుచ్చిబాబు ఉన్నారనే టాక్ ఉంది. ఇప్పటికే కవితను ఈ స్కాంలో సీబీఐ ప్రశ్నించడంతో పాటు ఇటీవల ఛార్జిషీట్‌లో ఆమె పేరును కూడా చేర్చింది. ఇలాంటి తరుణంలో బుచ్చిబాబు అరెస్ట్ బీఆర్ఎస్ వర్గాలకు టెన్షన్ పుట్టిస్తోంది.