రెండు వేల నోట్ల రద్దు నిర్ణయం ఫై సీతక్క కామెంట్స్

2016లో నోట్ల రద్దు దరిమిలా చలామణీలోకి తెచ్చిన రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించింది. రూ.2 వేల నోట్లు ఇవ్వడం తక్షణం ఆపేయాలని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. అయితే.. నిర్ణీత కాలపరిధిలో రూ. 2000 కరెన్సీ ఉపయోగంలో లేకుండా చేసేందుకు, ఎవరి వద్దనైనా ఈ నోట్లు ఉంటే వాటిని బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడానికి/మార్చుకోవడానికి తగినంత సమయం ఉండేందుకు వీలుగా.. సెప్టెంబరు 30 దాకా ఈ నోట్లు చలామణీలో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఫై ములుగు కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు.

‘మళ్లీ మైక్ ముందుకు వచ్చి చెప్తే.. జనం ఛీ కొడతారని ఆర్బీఐతో కానిచ్చేసాడు’ అంటూ ప్రధాని మోదీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. సీతక్క పోస్ట్‌పై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మోదీ మంచి నిర్ణయం తీసుకున్నారని, రూ.2 వేల నోట్లను రద్దు చేయడం వల్ల మీ పార్టీకి వచ్చే నష్టమేంటని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. దీని వల్ల సామాన్యులకు ఎలాంటి నష్టం ఉండదని, అలాంటప్పుడు మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని సీతక్కపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.