ఓటు కోసం టీడీపీ తనకు ఆఫర్ ఇచ్చిందన్న రాపాక

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కోసం టీడీపీ తనకు ఆఫర్ ఇచ్చిందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చెప్పడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. రీసెంట్ గా జరిగిన ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక స్థానం లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ వేయడంతో ఆమె విజయం సాధించారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ ఆనం , ఉండవెల్లి శ్రీదేవి , కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి , మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లను వైస్సార్సీపీ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నలుగురు టీడీపీ కి అమ్ముడుపోయారని , కోట్లాది రూపాయిలు తీసుకొని టీడీపీ కి ఓటు వేశారని వైస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటేయాలంటూ తనకు ఆఫర్ అందిందని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు మరింత సంచలనం రేపుతోంది.

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత బొండా ఉమ స్పందించారు. రాపాక వరప్రసాద్ తాడేపల్లి స్క్రిప్టునే చదివారని విమర్శించారు. రాపాక ఓ చిల్లర మనిషి అని, జనసేనలో గెలిచి వైస్సార్సీపీ కి అమ్ముడుపోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అలాంటి వ్యక్తి ఈరోజు నీతులు చెబుతున్నాడని మండిపడ్డారు. రాపాకను కొనాల్సిన అవసరం టీడీపీకి లేదని స్పష్టం చేశారు. టీడీపీకి కావాల్సిన 23 ఓట్లు స్పష్టంగా ఉన్నాయని బొండా ఉమ పేర్కొన్నారు. అసలు, రాపాకను రూ.10 కోట్లు పెట్టి కొనేది ఎవరని, అతడికి రూ.10 వేలు కూడా ఎక్కువేనని ఎద్దేవా చేశారు.