కునో నేషనల్ పార్కులో మరో చీతా మృతి

దక్షిణాఫ్రికా నుంచి మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్కుకు తీసుకొచ్చిన చీతాల్లో మరో చీతా మృతి చెందింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 12 చీతాలను కునో నేషనల్ పార్క్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ చీతాల్లో ఉదయ్ అనే మగ చీతా గత కొద్దీ రోజులుగా ఆరోగ్యంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం చికిత్స పొందుతూ చీతా మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా తెలిపారు.

గతేడాది నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చీతాల్లో ఒకటైన సాషా ఈ ఏడాది మార్చిలో కన్నుమూసింది. నెల రోజుల వ్యవధిలో ఇప్పుడు మరో చీతా మరణించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా పరుగెత్తే జంతువులుగా గుర్తింపు పొందిన చీతాలు భారత్‌లో అంతరించిపోయి ఏడు దశాబ్దాలు గడుస్తోంది. చివరి చీతా 1948లో చనిపోయిన తర్వాత దేశంలో వాటి జాడ పూర్తిగా కనుమరుగయ్యింది. భారత ప్రభుత్వం 1952లో వీటిని అంతరించిపోతున్న జాతిగా ప్రకటించింది. చివరి చీతా చనిపోయిన తర్వాత ఇప్పటి వరకు దేశంలో చీతాల జాడ లేకుండా పోయింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కేవలం 7,500 చీతాలు మాత్రమే ఉన్నాయి.

ప్రపంచం మొత్తం చీతాల్లోని సగం నమీబియా, దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా దేశాల్లోనే ఉండగా.. మూడింట ఒక వంతు నమీబియాలో ఉన్నాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి వాటిని భారత్‌కు తీసుకొస్తున్నారు. మొదటి విడతలో గతేడాది సెప్టెంబరులో నమీబియా నుంచి 8, రెండో విడతలో ఈ ఏడాది ఫిబ్రవరి 17న దక్షిణాఫ్రికా నుంచి 12 సహా మొత్తం 20 వరకూ చీతాలు భారత్‌కు చేరుకున్నాయి.