సర్పంచ్ నవ్య కు క్షేమపణలు తెలిపిన ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘన్పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజయ్య తనను వేధించాడంటూ జానకీపురం గ్రామ సర్పంచ్ నవ్య మీడియా ముందుకు వచ్చి వాపోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ క్రమంలో నవ్య ఆరోపణలను సుమోటోగా తీసుకున్న మహిళా కమిషన్ వేధింపుల ఆరోపణలపై విచారణకు ఆదేశించింది. దీంతో రాజయ్య నేడు..నేరుగా సర్పంచ్ నవ్య ఇంటికి వెళ్లి క్షేమపణలు తెలిపారు. తనకు నలుగురు చెల్లెల్లు ఉన్నారని..తన ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు మహిళల ఆత్మగౌరవం కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.

ఇప్పటి వరకు జరిగిన పరిణామాలకు తాను చింతిస్తున్నానని చెప్పారు. తెలిసో తెలియకో తప్పులు చేసి ఉంటే మహిళా లోకాన్ని క్షమాపణలు కోరుతున్నానని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. జానకిపురం గ్రామాభిృద్ధికి సహకరిస్తానని ఎమ్మెల్యే రాజయ్య తెలిపారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అభివృద్థి అనేది నిరంతర ప్రక్రియ అని..జానకిపురం గ్రామ సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ నవ్యప్రవీణ్ కు సూచించారు.

సర్పంచి నవ్య మీడియాతో మాట్లాడుతూ.. చెడును తాను ఖండిస్తానని తెలిపారు. ఎవరికైనా పార్టీలో విలువ ముఖ్యం అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజయ్య వల్లే తాను సర్పంచిని కాగలిగానని అన్నారు. రాజకీయాల్లో అణచివేతలు, వేధింపులు ఉండరాదని కోరుకుంటానని తెలిపారు. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడితే సహించేది లేదని పేర్కొన్నారు. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న మహిళలకైనా గౌరవం ముఖ్యమని నవ్య వ్యాఖ్యానించారు. మహిళలను వేధిస్తే కిరోసిన్ పోసి నిప్పంటించేందుకు కూడా సిద్ధమేనని హెచ్చరించారు.