కాంగ్రెస్ నేతలకు ఎన్నికల కోడ్ అమలుకాదా..?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ నడుస్తుంది. తెలంగాణ లోను 17 స్థానాలకు సంబధించి ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈసీ కోడ్ అమలు చేసింది. కానీ అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం ఎన్నికల కోడ్ ను ఏమాత్రం లెక్కచేయకుండా ప్రభుత్వ ,కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా జ‌న‌గామ‌లో మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఎన్నిక‌ల కోడ్‌ను కాద‌ని, ఓ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు.

జ‌న‌గామ వైష్ణ‌వి గార్డెన్స్‌లో కుట్టు మెషీన్ శిక్ష‌ణ పూర్తి చేసుకున్న మ‌హిళ‌ల‌కు స‌ర్టిఫికెట్ల‌ను ప్ర‌దానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో భువ‌న‌గిరి ఎంపీ అభ్య‌ర్థి చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి, జ‌న‌గామ డీసీసీ అధ్య‌క్షుడు కొమ్మూరి ప్ర‌తాప్ రెడ్డితో పాటు ప‌లువురు పాల్గొన్నారు. దీనిపై బిఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయ‌కులు ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించార‌ని పేర్కొంటూ, ఆధారాల‌తో యాదాద్రి భువ‌న‌గిరి జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.