ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాల్లో వికారాబాద్ లాస్ట్..

తెలంగాణ పదోతరగతి పరీక్షల ఫలితాలు వచ్చేసాయి. మంగళవారం ఉదయం బషీర్‌బాగ్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం ప‌ది ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణ‌త నమోదు కాగా.. నిర్మ‌ల్ జిల్లా 99.05 శాతంతో ప్ర‌థ‌మ స్థానంలో నిల‌వ‌గా, 65.10 శాతంతో వికారాబాద్ జిల్లా చివ‌రి స్థానంలో నిలిచింది. సిద్దిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజ‌న్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడు స్థానంలో నిలిచింది.

ఇక గతంలో మాదిరిగా ఈసారి కూడా బాలికలే పైచేయి సాధించారు. బాలిక‌లు 93.23 శాతం ఉత్తీర్ణ‌త‌, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో ఉత్తీర్ణ‌త శాతం న‌మోదైంది. ఇక పదో తరగతి ఫెయిలైన విద్యార్థుల‌కు జూన్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 9.30 నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కొన‌సాగ‌నుంది. ఫెయిలైన విద్యార్థులు సంబంధిత పాఠ‌శాల‌ల్లో మే 16వ తేదీ లోపు ప‌రీక్ష ఫీజు చెల్లించాలి. రీకౌంటింగ్, రీవెరిఫికేష‌న్‌కు 15 రోజుల పాటు అవ‌కాశం క‌ల్పించారు. రీకౌంటింగ్‌కు రూ. 500, రీవెరిఫికేష‌న్‌కు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు.