పిఠాపురంలో పవన్ ఓడిపోవడం ఖాయం – ముద్రగడ పద్మనాభం

ఏపీలో ఎన్నికల సమరం వాడివేడిగా కొనసాగుతుంది. ఈసారి విజయమే లక్ష్యంగా అన్ని పార్టీలు కృషి చేస్తున్నాయి. ముఖ్యంగా జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా కూటమి పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే ఈసారి అందరి దృష్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైనే ఉంది. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన పవన్..రెండు చోట్ల ఓడిపోగా..ఈసారి పిఠాపురం నుండి బరిలోకి దిగుతుండడం తో అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు..? పవన్ కళ్యాణ్ కు మద్దతు పలుకుతున్నారా..లేదా..? అని మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు సినీ తారలు సైతం పిఠాపురంలో పర్యటిస్తూ పవన్ కళ్యాణ్ కు మద్దతు తెలుపుతూ..ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఈసారి పవన్ గెలుపు ఖాయమని కొండబద్దలు కొడుతున్నారు.

ఈ తరుణంలో వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మాట్లాడుతూ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయమని తెలిపారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. తన పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. ఎమ్మెల్యే పదవి కోసం హైదరాబాద్ నుంచి పిఠాపురం పారిపోయి వచ్చారని ఎద్దేవా చేశారు.

పవన్ కల్యాణ్ అర్థంపద్దం లేకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని , పద్ధతిగా అడిగితే ఎన్ని ప్రశ్నలకైనా సమాధానం చెబుతానన్నారు. రంగువేసుకుని వస్తే ఓట్లు వేయరని, తొందరలో పవన్ పార్టీ ప్యాకప్ చెప్పడం ఖాయమని జోస్యం చెప్పారు. తోటి వారిని గౌరవిడంచడం రాదని, పవన్ కల్యాణ్‌కు డబ్బే ప్రాణమన్నారు. సినిమాల్లో నటించాలని, రాజకీయాల్లో కాదని హితవు పలికారు. రైతులకు సహాయం చేయడానికి తీసుకున్న చందాల్లో ఎంత వినియోగించారో సమాధానం చెప్పాలన్నారు. పవన్ కు సినిమా ఆదాయం కంటే రాజకీయ ఆదాయమే బాగుందన్నారు.