భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్

దాదాపు 18 నెలల తర్వాత తెలంగాణ లో స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. అన్ని జాగ్రత్తలు తీసుకొని విద్యాసంస్థలు పున: ప్రారంభించారు. మొదటి రోజు కాస్త విద్యార్థుల శాతం తక్కువగానే నమోదు అయినప్పటికీ..రెండో రోజు విద్యార్థుల శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇలా తెలిపారో లేదో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్ తేలి షాక్ ఇచ్చింది.

తెలంగాణలో పాఠశాలలు తెరిచి 2 రోజులు కాలేదు.. అప్పుడే కరోనా కలవరం మొదలైంది. ఇప్పుడే పిల్లల్ని పాఠశాలకు పంపించాలా..? వద్దా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్న సమయంలో.. విద్యాలయాల్లో నమోదవుతున్న కేసులు వారిని ఖంగారుకు గురి చేస్తున్నాయి. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం గోవిందపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. దీంతో పాఠశాలను శానిటైజ్ చేశారు విద్యాశాఖ అధికారులు. ఈ క్రమంలో ముందస్తు చర్యల్లో భాగంగా ఎమ్‌ఈఓ(MEO) పాఠశాలకు వారం రోజులు సెలవులు ప్రకటించారు.

ఇక రాష్ట్రవ్యాప్తంగా 37 వేల 768 పాఠశాలల్లో 52 లక్షల 52 వేల 303 విద్యార్థులు ఉన్నారు. ఇవాళ 14 లక్షల 76 వేల 874 మంది హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో 38.82 శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 40.42 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరు కాగా.. మేడ్చల్ జిల్లాలో అతి తక్కువగా 17.26 శాతం హాజరు నమోదైంది.