ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి గుండెపోటు

నెల్లూరు ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి మరోసారి గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను చెన్నైకు తరలిస్తున్నారు. ముందుగా ఆయన్ను నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి చూసిన డాక్టర్స్ రెండు వాల్వ్‌లు మూసుకుపోయినట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం చెన్నైకు వెళ్లాలని సూచించడం తో వెంటనే కుటుంబ సభ్యులు చెన్నైకు తరలిస్తున్నారు. కాగా ఆయనకు గతంలోనే ఓసారి గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. బెంగుళూరులోని ఆస్ట్రా వైద్యశాలకు తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆసుపత్రి నుంచే ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. తాజాగా మేకపాటికి మరోసారి గుండెపోటు గురవ్వడం అభిమానులు, కార్యకర్తలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇక కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి.. మొదట బూదవాడ సొసైటీ అధ్యక్షుడిగా పనిచేశారు. తొలిసారి 1999లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2004, 2009లలో వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అనంతరం జగన్ నాయకత్వంలోని వైస్సార్సీపీ లో చేరారు. 2014 ఎన్నికల్లో వైస్సార్సీపీ తరఫున పోటీ చేయగా.. బొల్లినేని వెంకట రామారావు చేతిలో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి.. మళ్లీ అసెంబ్లీ అసెంబ్లీలో అడుగుపెట్టారు.