ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు..మరో కీలక వ్యక్తి అరెస్ట్

వ్యాపారవేత్త గౌతం మల్హోత్రాను అరెస్ట్ చేశామంటూ ప్రకటన

ed-takes-gautam-malhotra-into-custody-in-delhi-liquor-scam-case

న్యూఢిల్లీః ఢీల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు కొనసాగిస్తోంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ మల్హోత్రాను అరెస్టు చేసినట్టు ఈడీ తాజాగా వెల్లడించింది. ఎమ్మెల్సీ కవిత మాజీ సహాయకుడు, ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు బుధవారం అరెస్టయిన విషయం వెలుగులోకి వచ్చిన కొద్ది సేపటికే ఈడీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. మద్యం విధానంలో మార్పుల వెనుక గౌతమ్ కీలకపాత్రధారి అన్న ఆరోపణలను ఆయన ఎదుర్కొంటున్నారు.

గత రాత్రి గౌతమ్ మల్హోత్రాను అదుపులోకి తీసుకున్న ఈడీ.. నేడు అధికారికంగా ఆయన అరెస్టును ప్రకటించినట్టు సమాచారం. అధికారులు ఆయనను బుధవారం మధ్యాహ్నం సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. గౌతమ్ మల్హోత్రాకు మద్యం వ్యాపారులతో సన్నిహిత వ్యాపార సంబంధాలు ఉన్నట్లు పలు ఆధారాలు లభ్యమయ్యాయని ఈడీ తెలిపింది. ఓ రాజకీయ పార్టీకి చెందిన పలువురు నేతలతో డబ్బు లావాదేవీలు జరిపినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయని పేర్కొంది. మద్యం విధానం రూపకల్పన‌కు సంబంధించిన వ్యవహారాల్లో గౌతమ్ ప్రమేయం ఉన్నట్టు ఈడీ తెలిపింది.