పవన్ పార్టీ ఎందుకు పెట్టారో అందరికీ తెలుసుః ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్

సినిమా వాళ్లను చూడాలని జనాలకు ఆసక్తి ఎక్కువన్న గ్రంథి శ్రీనివాస్

mla-grandhi-srinivas-satires-on-pawan-kalyan

అమరావతిః జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే వైఎస్‌ఆర్‌సిపి నేతల విమర్శల దాడి కూడా తీవ్రస్థాయికి చేరింది. తాజాగా, పవన్ కల్యాణ్ సభలకు భారీగా జనాలు హాజరవుతుండడం పట్ల భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సెటైర్ వేశారు. యాంకర్ అనసూయ వచ్చినా రాజమండ్రిలో జనం క్రిక్కిరిసిపోతారు అని వ్యాఖ్యానించారు. సినిమా వాళ్లను చూడాలన్న ఆసక్తి ప్రజల్లో అధికంగా ఉంటుందని, అంతకుమించి మరేమీ లేదని అన్నారు. పవన్ పార్టీ ఎందుకు పెట్టారో అందరికీ తెలుసని, చంద్రబాబుకు మేలు చేసేందుకే పవన్ కృషి చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు కళ్లతో చూస్తున్న పవన్ కల్యాణ్ కు వైఎస్‌ఆర్‌సిపి అభివృద్ధి కనిపించడంలేదని గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు.

గోదావరి జిల్లాలో రౌడీయిజం అని పవన్ కల్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదం అని కొట్టిపారేశారు. నాడు చిరంజీవి కుమార్తె శ్రీజ తమకు బాబాయ్ పవన్ కల్యాణ్ వల్ల ప్రాణహాని ఉందని చెప్పడం జనాలకు ఇంకా గుర్తుందని, పవన్ తుపాకీ పట్టుకుని రౌడీలా వ్యవహరించిన తీరు ప్రజలు మర్చిపోలేదని అన్నారు. భీమవరంలో ఓటర్ల సంఖ్య ఎంత, ఎన్నికల పద్ధతి… ఇవేవీ తెలియకుండా పవన్ మాట్లాడుతున్నాడని, మొదట పార్టీ గుర్తును, పార్టీని కాపాడుకోవడంపై పవన్ దృష్టి పెడితే బాగుంటుందని గ్రంథి శ్రీనివాస్ హితవు పలికారు. పవన్ కల్యాణ్ నిన్న నరసాపురంలో వారాహి యాత్ర, సభ ముగిసిన అనంతరం భీమవరం చేరుకున్న సంగతి తెలిసిందే.