సిఎం జగన్‌తో భేటీ అయిన ఎమ్మెల్యే బాలినేని

పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారంటూ బాలినేనిపై ప్రచారం

mla-balineni-meet-cm-jagan-in-tadepalli-camp-office

అమరావతిః మాజీ మంత్రి, ఒంగోలు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది. గత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవిని కోల్పోయారు. ఇటీవల ఆయన వైఎస్‌ఆర్‌సిపి ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేశారు. బాలినేని ఇప్పటివరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైఎస్‌ఆర్‌సిపి ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు. పార్టీపై అలక కారణంగానే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారంటూ కథనాలు వచ్చాయి.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తనకు ప్రాధాన్యత లభించడం లేదంటూ బాలినేని కొన్నాళ్లుగా అసంతృప్తితో ఉన్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇటీవల రాజీనామా తర్వాత తాడేపల్లి రావాలని పార్టీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చినా ఆయన స్పందించలేదని తెలిసింది. బాలినేని గత మూడ్రోజులుగా హైదరాబాద్ లోనే ఉన్నారు. కాగా, వ్యతిరేక వర్గాలను ప్రోత్సహిస్తున్నారంటూ బాలినేనిపై పార్టీ హైమాండ్ కు ఫిర్యాదులు వెళ్లాయి. బాలినేనిపై ఫిర్యాదు చేసినవారిలో పలువురు ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఉన్నట్టు తెలుస్తోంది.