పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల పరిహారం చెల్లించాలిః షర్మిల

9 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్న షర్మిల

YSRTP chief YS Sharmila sends trolley filled with damaged crops to CM KCR

హైదరాబాద్‌ః తెలంగాణలో అకాల వర్షాలు, రైతుల కడగళ్లపై వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. రైతులకు ముల్లు గుచ్చుకుంటే పంటితో తీస్తానన్న కెసిఆర్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ రైతు వ్యతిరేక సర్కారు అని విమర్శించారు. అకాల వర్షంతో రాష్ట్రంలో 9 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం లెక్కలు మార్చి చెబుతున్నా, ఇప్పటికీ రైతులకు రూపాయి కూడా నష్ట పరిహారం అందించలేదని షర్మిల ఆరోపించారు.

మరోవైపు అక్కడక్కడా తెరుచుకున్న ఐకేపీ సెంటర్లలో వడ్లు తడుస్తున్నా కొనుగోలు జరగడంలేదని తెలిపారు. మిల్లర్లు రైతులను నిలువునా దోచుకుంటున్నారని షర్మిల మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే పూర్తిస్థాయిలో ఐకేపీ సెంటర్లు తెరిచి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు కనీసం ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.