గణేష్ ఉత్సవాలపై జీహెచ్ఎంసీ అధికారులతో మంత్రి తలసాని సమీక్ష

రేపటి నుంచి గణేశ్ ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రి తలసాని జీహెచ్ఎంసీ అధికారులతో భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రజలను కోరారు. మట్టి విగ్రహాల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో 6 లక్షల మట్టి విగ్రహాల పంపిణీ జరుగుతోందన్నారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిర్వాహకులు సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్ కాకుండా నిమజ్జనం చేయాలని కోరారు.

ఇక సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సైతం శాంతి భద్రతలకు భంగం కలుగకుండా, ప్రశాంత వాతావరణంలో గణేశ్‌ ఉత్సవాలు జరిగేలా క్షేత్ర స్థాయి నుంచి సిబ్బంది సిద్ధం కావాలని అధికారులకు ఇప్పటికే సూచించడం జరిగింది. గణేశ్ ఉత్సవాల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి గణేశ్ మండపం దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులను కోరారు. అలాగే మండపాలకు సంబంధించి రిజిస్ట్రేషన్లు తప్పకుండా చేసుకోవాలన్నారు.