పాకిస్థాన్ లో వరద బీభత్సం.. సాయం అందించేందుకు భారత్ సంసిద్ధత!

పాక్ కు ఆహార సాయంపై కేంద్రంలో అత్యున్నత స్థాయి చర్చలు

India Reportedly Discussing Flood Aid As Pak Minister Talks Food Import

న్యూఢిల్లీః పొరుగుదేశం పాకిస్థాన్ కనీవినీ ఎరుగని రీతిలో వరద బీభత్సం నెలకొనడం తెలిసిందే. 3 కోట్ల మందికి పైగా ఈ వరద ప్రభావానికి గురయ్యారు. 1000 మందికి పైగా మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ కు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పాక్ కు ఆహార సాయం అందించడంపై కేంద్రంలో అత్యున్నత స్థాయి సమావేశం జరుగుతోంది. దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని జాతీయ మీడియా పేర్కొంది. పాక్ లో 2005లో భారీ భూకంపం సంభవించినప్పుడు, 2010లో వరదలు వచ్చినప్పుడు ఆ దేశానికి భారత్ సాయం చేసింది.

కాగా, పాకిస్థాన్ లో భారీ వరదలకు బలైన వారి కుటుంబాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. పాక్ ప్రజలు ఈ కష్టకాలం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. అటు, ఈ విపత్కర సమయంలో భారత్ నుంచి ఆహార పదార్థాలు దిగుమతి చేసుకునే అవకాశం ఉందంటూ పాక్ మంత్రి ఒకరు సూచన ప్రాయంగా చెప్పినప్పటికీ, పొరుగుదేశం నుంచి భారత్ కు అధికారిక విజ్ఞాపన అందాల్సి ఉంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం తాలూకు దుష్పరిణామాలతో కుదేలైన పాకిస్థాన్ ను వరదలు మరింత దుస్థితిలోకి నెట్టాయి. ప్రస్తుతం అక్కడ నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/