ఓల్డ్ సిటీ లో ఎంఐఎం నేతపై పీడీ యాక్ట్‌ కేసు నమోదు

ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఫై నగర పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి చర్లపల్లి జైలుకు పంపించగా..తాజాగా ఎంఐఎం నేత కషఫ్‌పై పీడీయాక్ట్‌ ప్రయోగించారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ కషఫ్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించినట్లు తెలుస్తోంది. అంతేకాదు కషఫ్‌ను చర్లపల్లి జైలుకు తరలించినట్లు సమాచారం.

గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్య‌ల త‌ర్వాత ఆ వీడియోను సోష‌ల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసి.. ఉద్రిక్త‌త‌లు సృష్టించేందుకు క‌ష‌ఫ్ ప్ర‌య‌త్నించాడ‌ని పోలీసులు పేర్కొన్నారు. క‌ష‌ఫ్ వ్యాఖ్య‌ల‌తో పాత‌బ‌స్తీలో వివిధ ప్రాంతాల్లో అల్ల‌ర్లు చెల‌రేగాయ‌ని తెలిపారు. స‌య్య‌ద్ ఖాద్రీని ఏడాది పాటు జైల్లోనే ఉంచ‌నున్నారు పోలీసులు. ఈ నెల 23న బ‌షీర్‌బాగ్ సీపీ కార్యాల‌యం ఎదుట నిర్వ‌హించిన ధ‌ర్నాలోనూ క‌ష‌ఫ్ కీల‌క‌పాత్ర పోషించాడు.

ప్రవక్తపై వ్యాఖ్యలు చేస్తూ వీడియో రిలీజ్‌ చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం రేపింది. ఈ తరుణంలో నగరంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా.. రాజకీయంగానూ విమర్శలు చెలరేగాయి. దీంతో పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. మరోవైపు క్రమశిక్షణ చర్య కింద బీజేపీ కూడా రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది కూడా.

ప్రివెంటివ్‌ డిటెన్షన్‌ యాక్ట్‌ (పీడీ యాక్ట్‌) ను మన దేశంలో 1950లో అమల్లోకి తీసుకొచ్చారు. పేరుమోసిన నేరస్థులను ఒక సంవత్సరం పాటు జైలులో ఉంచడానికి పోలీసులు అమలు చేసే చట్టం ఇది. ఈ చట్టం ద్వారా ఒక వ్యక్తిని కనిష్టంగా మూడు నెలలు.. నుంచి గరిష్టంగా 12 నెలల వరకు జైలులో నిర్బంధించవచ్చు.