నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్న మంత్రి కెటిఆర్‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటి

Minister KTR will visit Delhi today

హైదరాబాద్‌ః బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీ శాఖ మంత్రి కెటిఆర్‌ ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నారు. రెండ్రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే మకాం వేసి పలువురు మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కూడా కేటీఆర్ భేటీ అవనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కొన్నాళ్లుగా రాష్ట్రంలో బిజెపి, బిఆర్ఎస్ ఉప్పు, నిప్పుగా ఉన్నాయి. ఈ క్రమంలో గతంలో పలుమార్లు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేటీఆర్‌ కేంద్ర మంత్రులను కలిసినా అమిత్‌ షాతో భేటీ కాలేదు. అయితే చాన్నాళ్ల తర్వాత ఇద్దరు భేటీ కానుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది.

రాష్ట్ర ప్రాజెక్టులకు కేంద్ర సహకారం కోరేందుకే ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నట్లు చెబుతున్నా కేటీఆర్, అమిత్ షా భేటీలో ఇతర రాజకీయ వ్యవహారాలూ చర్చకు వచ్చే అవకాశాలున్నట్లు తెలిసింది. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్థి కార్యక్రమాలకు కేంద్రప్రభుత్వం నుంచి సహకారం లభించడం లేదని, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర అంశాల విషయంలో మరోసారి మరింత ఒత్తిడి తీసుకువచ్చేందుకే కెటిఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని బిఆర్ ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్థి కార్యక్రమాలకు హోంశాఖ పరిధిలో ఉన్న భూముల గురించి కెటిఆర్‌ అమిత్‌ షాతో మాట్లాడుతారని చెప్పాయి. నగరంలో తలపెట్టిన స్కై వేల నిర్మాణం కోసం రక్షణశాఖ నుంచి అడుగుతున్న కంటోన్మెంట్‌ భూముల వ్యవహారం గురించి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో భేటీ కానున్నారు. వరంగల్‌ మామునూరు ఎయిర్‌ పోర్ట్‌ కు సంబంధించిన అంశం, మెట్రో విస్తరణకు సంబంధించి ఆయా శాఖల కేంద్ర మంత్రులతో కెటిఆర్‌ సమావేశం అవనున్నారు.