పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ – కేటీఆర్

పోరాటాల గడ్డ తెలంగాణ గడ్డ అని మంత్రి కేటీఆర్ అన్నారు. భారత్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన రోజును గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజుల పాటు జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు జరుపుతుంది. ఈ క్రమంలో నేడు సిరిసిల్లలోని జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా దినోత్సవంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ‌కు పోరాటాలు కొత్త కాదని , 1948లో రాచరిక ప్రభువుపై, 1956లో ఆంధ్రాలో విలీనమైనప్పుడు, 1960 దశకంలో తెలంగాణ కోసం, 2001లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కోసం పోరాటం జరిగి లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వల్లే రాష్ట్రం ఏర్పడిందని, అలాంటి గొప్ప నాయకుడి పేరును రాష్ట్ర కొత్త సచివాలయానికి పెట్టడం హర్షణీయమన్నారు.

కేసీఆర్ నేతృత్వంలో వ్యవసాయం, విద్యుత్ తదితర రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతోందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సిరిసిల్లలో ఒక్క డిగ్రీ కాలేజీ మాత్రమే ఉండేదని, కానీ తమ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయ, పాలిటెక్నిక్ కళాశాలలు సహా అనేక ఇతర కళాశాలలు ఏర్పాటు చేశామని కేటీఆర్ చెప్పారు. పేదవాడి కళ్లల్లో ఆనందం చూడాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకోసమే అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత సంక్షేమానికి రాష్ట్రం ట్రేడ్ మార్క్‌గా నిలిచింద‌న్నారు. జిల్లాలో 85 నుంచి 90 శాతం కుటుంబాల‌కు పెన్ష‌న్ అందుతుంద‌న్నారు. సిరిసిల్ల జిల్లాకు కొత్త‌గా 17 వేల పెన్ష‌న్‌లు మంజూరు చేసిన‌ట్లు మంత్రి గుర్తు చేశారు. కరెంట్, నీళ్ల‌ వ్యవస్థ కూడా మెరుగు పడింద‌న్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు జిల్లాలో చేపడుతున్నామ‌ని తెలిపారు.