జగదీశ్ రెడ్డి ని బాహుబలి తో పోల్చిన సూర్యపేట ఎస్పీ

మంత్రి జగదీశ్ రెడ్డి ని బాహుబలి తో పోల్చారు సూర్యపేట ఎస్పీ రాజేంద్ర ప్రసాద్. శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భాంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ ‘జయహో జగదీశ్ రెడ్డి’ అంటూ సభకు వచ్చిన వారితో నినాదాలు చేయించారు. అంతే కాకుండా మంత్రి జగదీశ్ రెడ్డి ని బాహుబలి అంటూ ఎస్పీ సంబోధించారు.

దీంతో సభకు వచ్చిన వారు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎస్పీ అలా నినాదాలు ఇస్తున్నప్పుడు మంత్రి జగదీశ్ రెడ్డి స్టేజీపైనే ఉండడం గమనార్హం. మంత్రితో సహా ఏ ఒక్క అధికారి కూడా నినాదాలిస్తున్నప్పుడు ఎస్పీని వారించలేదు. ఓ జిల్లా స్థాయి అధికారిగా ఉండి ఎస్పీ ఈ విధంగా నినాదాలు ఇవ్వడమేంటని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్పీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.