తారక రామారావు పేరులోనే పవర్ ఉందిః మంత్రి కెటిఆర్‌

ఎన్టీఆర్ శిష్యుడిగా కెసిఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పారని పొగడ్తలు

minister-ktr-speech-in-khammam

హైదరాబాద్ః ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఎన్టీఆర్ ఆరాధ్య దైవమని, రాముడైనా ఆయనే.. కృష్ణుడైనా ఆయనేనని తెలంగాణ మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. శనివారం ఖమ్మంలోని లక్కారం ట్యాంక్ బండ్ పై ఎన్టీఆర్ పార్క్ ను, విగ్రహాన్ని మంత్రి పువ్వాడ అజయ్ తో కలిసి కెటిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నందమూరి తారక రామారావు తన నటనతో, నాయకత్వ పటిమతో ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు.

తెలుగువారికి ప్రపంచ గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఆయనేనని చెప్పారు. అందుకే ప్రస్తుతం ప్రపంచంలో ఏమూలన నివసిస్తున్నా సరే తెలుగు వారందరికీ ఆరాధ్య దైవమయ్యాడని అన్నారు. రాముడిని, కృష్ణుడిని జనం ఆయనలోనే చూసుకుంటారని తెలిపారు. అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించగలగడం తన అదృష్టమని మంత్రి కెటిఆర్ చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, తనకూ ఆ పేరు ఉండడం సంతోషంగా ఉందని వివరించారు.

ఎన్టీఆర్ శిష్యుడిగా కెసిఆర్ కూడా ఆయన బాటలోనే నడుస్తున్నారని, తెలంగాణ అస్తిత్వాన్ని దేశం నలుమూలలా చాటారని వివరించారు. ఎన్టీఆర్ సహా దక్షిణ భారత దేశంలో ముఖ్యమంత్రి పదవిని మూడుసార్లు ఎవరూ అధిష్టించలేదని మంత్రి కెటిఆర్ గుర్తుచేశారు. అయితే, వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ ను మరోమారు అధికారంలోకి తెచ్చి కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి సీటులో కూర్చుంటారని కెటిఆర్ తెలిపారు.