వ్యాక్సిన్ స‌ర్టిఫికెట్‌తోనే అస‌లు స‌మ‌స్య‌: యూకే

న్యూఢిల్లీ: బ్రిటన్ కొత్తగా తీసుకొచ్చిన ట్రావెల్ రూల్స్‌పై భారత ప్రభుత్వం సీరియస్ అయిన నేపథ్యంలో యూకే ప్రభుత్వం కొత్త ట్విస్ట్ ఇచ్చింది. సమస్య వ్యాక్సిన్‌తో కాదని.. వ్యాక్సిన్ సర్టిఫికేట్‌తో అంటూ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో బ్రిటన్ ప్రభుత్వం గతంలో ఉన్న ట్రావెల్ రూల్స్‌ను సవరించింది. వాటి స్థానంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఆ నిబంధనల ప్రకారం.. భారత్‌లో రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారిని కూడా బ్రిటన్ ప్రభుత్వం టీకా తీసుకోని వారిగా పరిగణిస్తుంది. ఈ క్రమంలోనే స్వదేశంలో వ్యాక్సిన్ తీసుకున్న భారత ప్రయాణికులు బ్రిటన్ వచ్చిన తర్వాత 10 రోజులపాటు క్వారెంటైన్‌లో ఉండాల్సిందే అంటూ తేల్చి చెప్పింది. ఇది భారత ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో భారత ప్రభుత్వం స్పందించింది. బ్రిటన్‌లో అభివృద్ది చెందిన కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనికా) వ్యాక్సిన్‌ను ఆ దేశమే గుర్తించకపోవడం ఏంటని ప్రశ్నించింది. దీన్ని వివక్షగా పరిగణించాల్సి వస్తుందంటూ ద్వజమెత్తింది.

ఈ నేపథ్యంలో బ్రిటన్ తాజాగా స్పందించింది. సమస్య వ్యాక్సిన్‌తో కాదు.. వ్యాక్సిన్ సర్టిఫికెట్‌తో అంటూ సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చింది. కొత్త ట్రావెల్ నిబంధనల ప్రకారం.. కొవిషీల్డ్ వ్యాక్సిన్‌ను బ్రిటన్‌ గుర్తించినట్లు వెల్లడించింది. అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌కు సబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయని తెలిపింది. అందువల్లే.. భారత ప్రయాణికులు క్వారెంటైన్‌లో ఉండాల్సి వస్తోందని చెప్పింది. అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు భారత ప్రభుత్వంతో పని చేయనున్నట్లు వెల్లడించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/