కాంగ్రెస్ పార్టీకి సీఎంలు దొరికారు కానీ ఓటర్లు లేరుః మంత్రి కెటిఆర్

కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలోని పరిశ్రమలను కర్ణాటకకు తరలించుకుపోతారు.. కెటిఆర్

minister-ktr-says-congress-have-cm-candidate-but-not-votes

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్ శనివారం ఆయన జలవిహార్‌లో జరిగిన తెలంగాణ వ్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రులు దొరికారు కానీ, ఓటర్లు దొరకడం లేదని అన్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి పోటీ చేయరు కానీ ముఖ్యమంత్రి పదవి కావాలని చెబుతారని, చాలామంది ఆ పదవి కోసం చూస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు రిస్క్ తీసుకోవద్దన్నారు. కాంగ్రెస్‌లో సొంత నిర్ణయాలు తీసుకునేవారు లేరన్నారు. తెలంగాణలో సమ్మిళిత వృద్ధి కనిపిస్తోందన్నారు. ఐటీ ఎగుమతులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయన్నారు.

హైదరాబాద్‌లో పెట్టాలనుకున్న ఫాక్స్ కాన్ సంస్థను కర్ణాటకలో పెట్టాలని కాంగ్రెస్ నేత, అక్కడి ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లేఖ రాశారన్నారు. అంతేకాదు తెలంగాణలో వచ్చేది తమ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ లేఖలో పేర్కొన్నారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పరిశ్రమలు కర్ణాటకకు తరలించుకుపోతారని విమర్శించారు. కర్ణాటకలో 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారని, కానీ ఇక్కడ ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఉందన్నారు. రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. 2014కు ముందు తాగు, సాగునీటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? చూడాలన్నారు.

కెసిఆర్‌ను ఓడించేందుకు అందరూ ఏకమవుతున్నారని ఆరోపించారు. కానీ కెసిఆర్‌ సింహం లాంటివారని, సింగిల్‌గానే వస్తారన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? అని నిర్ణయించేది ప్రజలే కానీ రాహుల్ గాంధీ, నరేంద్రమోడీ కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులతో సమానంగా న్యాయవాదులు పోరాటం చేశారన్నారు. తెలంగాణ అభివృద్ధిపై కొంతమంది కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. దళిత బంధు ప్రకటించాలంటే దమ్ము ఉండాలన్నారు.

కాంగ్రెస్ టిక్కెట్లు ఢిల్లీలోనే కాకుండా బెంగళూరులోను నిర్ణయమవుతున్నాయన్నారు. రజనీకాంత్, సన్నీడియోల్ వంటి హీరోలు హైదరాబాద్‌ అభివృద్ధిని మెచ్చుకున్నారన్నారు. కెసిఆర్‌ మళ్లీ గెలవకపోతే హైదరాబాద్ అభివృద్ధి ఆగిపోతుందన్నారు. ఈ పోరాటం ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతోందన్నారు. తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదన్నారు. గతంలో నెహ్రూ, ఇందిరా గాంధీతో కొట్లాడారని, ఇప్పుడు మోడీతో కొట్లాడుతున్నామన్నారు. 24వేలకు పైగా కొత్త పరిశ్రమలు తెలంగాణకు వచ్చాయన్నారు.