బుల్లెట్‌ పై వచ్చి నామినేషన్ దాఖలు రాజాసింగ్

రాజాసింగ్ వెంట పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు

Raja Singh came on bullet and filed nomination

హైదరాబాద్‌ః గోషామహల్ బిజెపి అభ్యర్థి రాజాసింగ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత దూల్‌పేట ఆకాశ్‌పురి హనుమాన్ మందిర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత తన అనుచరులతో కలిసి వచ్చి అబిడ్స్‌లోని రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన తన బుల్లెట్ బండిపై వచ్చారు. రాజాసింగ్ నామినేషన్ నేపథ్యంలో పెద్దఎత్తున బిజెపి కార్యకర్తలు, ఆయన అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నలుగురితో కలిసి అబిడ్స్ జీహెచ్ఎంసీ కార్యాలయలోకి వెళ్లి నామినేషన్ పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

నామినేషన్ దాఖలుకు ముందు రాజాసింగ్ మాట్లాడుతూ… గోషామహల్‌లో బిఆర్ఎస్ ఇప్పటి వరకు తన అభ్యర్థిని ప్రకటించలేదన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి ఎవరనేది మజ్లిస్ పార్టీ కార్యాలయంలో ఇంకా నిర్ణయించలేదని ఎద్దేవా చేశారు. 2014, 2019 ఎన్నికల్లో ధనబలంతో గెలవాలని ప్రతిపక్షాలు చూసినప్పటికీ, గోషామహల్ ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. ఇక్కడకు వచ్చిన వారంతా తమ వానరా సేన అన్నారు. మూడోసారి కూడా తనే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. మూడోసారి గెలిచి బిఆర్ఎస్, మజ్లిస్ పార్టీకి గుణపాఠం చెబుతామన్నారు.