దేశ సమస్యలను ఆ రెండు పార్టీలు పరిష్కరించలేకపోయిః మంత్రి కెటిఆర్

దేశ చరిత్రలో అత్యంత బలహీన ప్రధాని మోడీనే అని మండిపాటు

minister-ktr-press-meet-in-delhi

న్యూఢిల్లీః బిఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి కెటిఆర్ ఢిల్లీ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ సమస్యలను కాంగ్రెస్‌, బిజెపి పరిష్కరించలేకపోయాయని ఆరోపించారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయినా సమస్యలు అలాగే ఉన్నాయని, దేశంలో నేటికీ తాగునీరు, విద్యుత్ సౌకర్యం లేని గ్రామాలు చాలా ఉన్నాయని చెప్పారు. దేశంలో ఇప్పటివరకు పని చేసిన ప్రధానుల్లో అత్యంత బలహీనమైన ప్రధాని మోడీనే అని కెటిఆర్ విమర్శించారు. రూపాయి విలువ పాతాళంలోకి వెళ్లిందని.. అప్పులు ఆకాశానికి చేరాయని మండిపడ్డారు. ‘‘మమ్మల్ని ఎవరికో బీ టీమ్ అంటే ఎలా? ఎవరు ఎవరికి బి టీమ్? ఎవరు ఎవరితో కుమ్మక్కు అయ్యారో ప్రజలకు తెలుసు’’ అని అన్నారు.

బిఆర్ఎస్ ఎవరికీ బీ టీం కాదని.. బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరమని కెటిఆర్ స్పష్టం చేశారు. మేఘాలయాలో బిజెపి, కాంగ్రెస్, ఎన్సీపీ పొత్తు పెట్టుకున్నాయన్నారు. కరీంనగర్, నిజామాబాద్ లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బిజెపిలు కుమ్మక్కయ్యాయని కెటిఆర్ ఆరోపించారు. ఢిల్లీ నుంచి రాజకీయాలు చేయాలా? అని కెటిఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ కేంద్రంగానే బిఆర్ఎస్ రాజకీయాలు చేస్తుందని చెప్పారు. ‘‘ఢిల్లీ కేంద్రంగా నేషనల్ మీడియా ఉండొచ్చు. అయితే ఢిల్లీ కేంద్రంగా మాత్రమే దేశం నడవదు. హైదరాబాద్ కేంద్రంగా కూడా జాతీయ రాజకీయాలు చేయొచ్చు. నేషనల్ మీడియాకు నేషనల్ క్యాపిటల్ గొప్ప కావొచ్చు. మాకు హైదరాబాదే స్థావరం. అక్కడి నుంచే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం. భవిష్యతులో మీరే చూస్తారు’’ అని కెటిఆర్ చెప్పుకొచ్చారు.

కేంద్రం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తామని, కేజ్రీవాల్ ప్రభుత్వానికి మద్దతుగా పార్లమెంటులో ఓటేస్తామని తెలిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కెసిఆర్ ఇప్పటికే వ్యతిరేకించారని.. దీనిపై పార్లమెంట్‌లో బిఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఆర్డినెన్స్ విషయంలో బిజెపికి మద్దతుగా కాంగ్రెస్‌ ఓటేస్తానని అంటుందని.. బిజెపి, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని విమర్శించారు. దేశంలో తామె మాత్రమే ఉండాలనేది రెండు పార్టీల సిద్ధాంతమని ఆరోపించారు.