ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’

నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహణ

Amaravati: అర్హులై ఉండి ఏ ఒక్కరూ లబ్ధి అందకుండా మిగిలిపోకూడదన్న తపన, తాపత్ర­యంతో ప్రతి ఇంట్లో ఏ చిన్న సమస్య ఉన్నా దానిని పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న సురక్ష’. రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నెలరోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించారు

CM Jagan Mohan Reddy speaking at the inaugural program of ‘Jagananna Suraksha’ from the CM’s camp office on Friday

ఇంటింటికీ వెళ్లి జల్లెడ..

ఇప్పటికే రాష్ట్రంలో శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ మంచి చేసిన జగనన్న ప్రభుత్వం.. అర్హులై ఉండి ఏ కారణంతోనైనా ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి కూడా సంక్షేమ పథకాలు అందాలన్న లక్ష్యంతో ఈ ‘జగనన్న సురక్ష‘ ద్వారా ఇంటింటినీ జల్లెడ పట్టనుంది. తద్వారా వారికి లబ్ధి చేకూర్చడంతో పాటు వారికింకేమైనా సర్టిఫికెట్లు (జనన, మరణ, కుల, సీసీఆర్సీ, రేషన్‌ కార్డు డివిజ­న్, హౌస్‌ హోల్డ్‌ డివిజన్, ఇన్‌కమ్‌ మొదలైన 11 రకా­లు ధ్రువీకరణపత్రాలు) అవసరమైతే సర్వీస్‌ ఫీజు లే­కుండా వాటిని ఉచితంగా అందించనుంది. కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా.. లంచాలకు, వి­వక్షకు తావులేకుండా.. నూటికి నూరు శాతం  సంతృప్త స్థాయిలో పారదర్శకంగా సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. దే­శంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఇంటికీ వెళ్లి స­మస్యలేమైనా ఉంటే తెలుసుకుని పరిష్కారం చూపించే దిశగా చేస్తున్న వినూత్న కార్యక్రమం ఈ ‘జగనన్న సురక్ష’.

రేపటి నుంచి  గృహ సందర్శన..

వలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులతో కూడిన టీమ్‌ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటినీ సందర్శిస్తుంది. అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారు. వారికేమైనా కుల, ఆదాయ, జనన మొదలైన సర్టిఫికెట్లు అవసరమైతే వాటికి అవసరమైన పత్రాలను తీసుకుని దరఖాస్తులను దగ్గరుండి పూర్తిచేస్తారు.

సమస్య పరిష్కారమయ్యే వరకు తోడుగా..

ఇలా తీసుకున్న దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారు. ఈ క్యాంపులు ఎప్పుడు, ఎక్కడ నిర్వహిస్తారో ముందుగానే తెలియజేస్తారు. ఆ రోజు దగ్గరుండి క్యాంపు వద్దకు తీసుకెళ్తారు. సమస్య పరిష్కారమయ్యేలా వారికి తోడుగా ఉంటారు.

జూలై 1 నుంచి క్యాంపులు..

మండల స్థాయి అధికారులైన తహశీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టీమ్‌ కాగా.. ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్‌ రెండో టీమ్‌గా ఏర్పడి సచివాలయంలో ఒకరోజు పూర్తిగా గడిపేలా చూస్తారు. జూలై 1 నుంచి ప్రతి సచివాలయంలో క్యాంపు నిర్వహించి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరించడంతోపాటు సేవా చార్జీలు లేకుండానే అవసరమైన సర్టిఫికెట్లను అందిస్తారు.

సర్వీస్‌ ఫీజు లేకుండా సర్టిఫికెట్ల జారీ..

జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ ధ్రువీకరణ పత్రాలు, లావాదేవీ మ్యుటేషన్లు, ఫోన్‌ నంబర్‌కు ఆధార్‌ అనుసంధానం, పంట సాగు కార్డులు, కొత్త రేషన్‌ కార్డు లేదా రేషన్‌ కార్డు విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించి కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల సర్టిఫికెట్లను ఉచితంగా జారీతో పాటు మరే ఇతర అవసరమైన సర్టిఫికెట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో అందిస్తుంది.

కార్యక్రమం వివరాలు..

రాష్ట్రంలోని 5.3 కోట్ల మంది పౌరులకు చేరువయ్యేలా 1.6 కోట్ల కుటుంబాలను సందర్శిస్తూ, జూలైæ 1 నుంచి∙ఈ కార్యకమం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 15,004 సురక్ష క్యాంపులు జరుగుతాయి.  ఇందులో 1.5 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వో­ద్యోగులు, 2.6 లక్షల మంది వలంటీర్లు పాల్గొంటారు. ఇక 26 జిల్లాలకు 26 మంది ప్రత్యేక ఐఏఎస్‌ అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ క్యాంపులను తనిఖీ చేస్తారు. ప్రోగ్రాం పురోగతిపై జిల్లా కలెక్టర్లు రోజువారీ సమీక్ష నిర్వహిస్తారు. అలాగే, సీఎం కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంపై వారం వారం సమీక్ష నిర్వహిస్తారు.

‘1902’తో హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు

వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, జగనన్న మీద, జగనన్న ప్రభుత్వం మీద ప్రేమ, అభిమానం ఉన్న ఉత్సాహవంతులు ఇళ్లను సందర్శించినప్పుడు ఇంటి యజమాని ఇంటివద్ద లేకపోయి­నప్ప­టికీ వారికి సమీపంలో క్యాంపు జరిగే రోజు నేరుగా అక్కడకు వెళ్లినట్లయితే వలంటీర్లతో కూడిన ఈ టీమ్‌ ‘1902’ హెల్ప్‌డెస్క్‌ ద్వారా అవసరమైన సహాయం అందిస్తుంది. ఇక గ్రామంలో.. సచివాలయ పరిధిలో ఏ రోజు ఈ కార్యక్రమం జరుగుతుందో తెలుసుకోవాలంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ ‘1902’ కి కాల్‌ చేయాలి. లేదా https://vswsonline.ap.gov.in/#/home   వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 

తాజా సినిమా విశేషాల కోసం ‘తెర ‘ క్లిక్ చేయండి : https://www.vaartha.com/category/news/movies/