నిజామాబాద్‌ పర్యటనకు మంత్రి కెటిఆర్‌

Minister KTR left for a visit to Nizamabad

హైదరాబాద్‌ః మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్‌లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. దీనితో పాటు న్యాక్‌, మున్సిపల్‌ కార్పొరేషన్‌ భవనాలను, అధునాతన వైకుంఠధామాన్ని, రఘునాథ చెరువు ట్యాంక్‌బండ్‌ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు. కెటిఆర్‌ వెంట మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సురేశ్‌ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి నిజామాబాద్‌ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.

అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు. కెటిఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. సభా ఏర్పాట్లను మంగళవారం ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్‌ తదితరులు పరిశీలించారు. నిజామాబాద్‌లోని ఈ ఐటీ టవర్‌ను మొత్తం 49,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆకట్టుకునే రీతిలో నిర్మించారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌తో కలుపుకొని మూడు అంతస్థులతో ఈ నిర్మాణాన్ని పూర్తిచేశారు. ఎకరం భూమిలో ఐటీ టవర్‌ను డిజైన్‌చేశారు. మిగిలిన 2.5 ఎకరాల భూమిని భవిష్యత్తులో ఐటీ టవర్‌ను విస్తరణకు ఉపయోగించనున్నారు.