ముందస్తు బెయిల్ కోసం దేవినేని ఉమా ప్రయత్నాలు

అంగళ్లు అల్లర్లు కేసులో ఏ2గా దేవినేని ఉమా

devineni uma
devineni uma

అమరావతిః ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అంగళ్లులో టిడిపి శ్రేణులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ఏ1గా చంద్రబాబును, ఏ2గా మాజీ మంత్రి దేవినేని ఉమాను చేర్చారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో అరెస్ట్ చేసే అవకాశాలు ఉండటంతో… దేవినేని ఉమా అలర్ట్ అయ్యారు. విశాఖలో నిర్వహించాల్సిన ప్రెస్ మీట్ ను రద్దు చేసుకున్నారు.

ఈ ఉదయం 10 గంటలకు విశాఖలోని టిడిపి కార్యాలయంలో దేవినేని ఉమా ప్రెస్ మీట్ ఉన్నట్టు మీడియా ప్రతినిధులకు సమాచారం వచ్చింది. అయితే ముదివేడు పీఎస్ లో కేసు నమోదయిందనే సమాచారం వచ్చిన వెంటనే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలను మొదలుపెట్టినట్టు సమాచారం. దేవినేని ఉమా ప్రెస్ మీట్ రద్దు కావడంతో మరో టిడిపి నేత పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.