ఆ కారణం వల్లే శరద్‌ పవార్‌ ప్రధాని కాలేకపోయారుః మోడీ

‘Sharad Pawar Didn’t Get Chance To Become PM Because Of Dynastic Politics Of The Congress, Says PM Modi

న్యూఢిల్లీ : కాంగ్రెస్ స్వార్థపూరిత రాజకీయాల వల్ల సత్తా ఉన్నవారు సైతం ప్రధాన మంత్రి పదవిని చేపట్టలేకపోయారని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆరోపించారు. అనేక మంది గొప్ప నేతల ఆకాంక్షలను కాంగ్రెస్ చంపేసిందని దుయ్యబట్టారు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్ వంటివారికి ప్రధాన మంత్రి పదవిని నిర్వహించే శక్తి, సామర్థ్యాలు ఉన్నప్పటికీ, వారు ఆ పదవిని చేపట్టలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజస్థాన్, మహారాష్ట్రలలోని ఎన్డీయే ఎంపీలతో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ఎన్డీయేను సమాయత్తం చేయడం కోసం మోడీ ఆ కూటమిలోని ఎంపీలను కొన్ని బృందాలుగా విభజించి, ఒక్కొక్క బృందంతో ఒక్కొక్క రోజు సమావేశమవుతున్నారు. ఆయన మంగళవారం రాజస్థాన్, మహారాష్ట్ర ఎన్డీయే ఎంపీల బృందంతో సమావేశమయ్యారు. వారసత్వ రాజకీయాలపై మోడీ దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. క్విట్ ఇండియా ఉద్యమాన్ని గుర్తు చేసుకుని, ఆ స్ఫూర్తితో దేశాన్ని అవినీతి, బుజ్జగింపులు, వారసత్వ రాజకీయాల నుంచి విముక్తి చేయడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.