హుస్సేన్‌ సాగర్‌లో వరద పరిస్థితిని పరిశీలించిన మంత్రి కెటిఆర్‌

Minister KTR inspected the flood situation in Hussain Sagar

హైదరాబాద్‌: మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌ కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌లో వరద పరిస్థితిని మంత్రి కెటిఆర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వర్షకాలం ప్రారంభానికి ముందే నాలాల్లో పూడిక తీశామని చెప్పారు. చెరువుల్లోనూ తక్కువ నీటిమట్టం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని వెల్లడించారు. నగరంలో ఎస్సార్‌డీపీ చేపట్టకముందు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవని చెప్పారు. హైదరాబాద్‌లో వారం రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయని, దీంతో హుస్సేన్‌ సాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతున్నదని మంత్రి కెటిఆర్‌ అన్నారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు.

విపత్కర పరిస్థితుల్లో చేతనైతే ప్రతిపక్షాలు సహాయక చర్యల్లో పాల్గొనాలని మంత్రి కెటిఆర్‌ సూచించారు. వర్షాలను కూడా రాజకీయం చేయడం సరికాదన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రాణనష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో 14 బ్రిడ్జిలు మంజూరు చేశామన్నారు.