వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో చుక్కెదురు

కొత్తగూడెం ఎమ్మెల్యేగా వనమా ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు తీర్పు

once-again-shock-to-kothagudem-mla-vanama

హైదరాబాద్ః కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక విషయంలో వనమా వెంకటేశ్వరరావుకు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ఎమ్మెల్యేగా వనమా ఎన్నిక చెల్లదంటూ రెండు రోజుల కిందట హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పు విషయంలో స్టే ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది.

తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పు అమలును నిలుపుదల చేస్తూ ఆదేశాలివ్వాలని వనమా వెంకటేశ్వరరావు హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్‌ దాఖలు చేశారు. తీర్పును తాను సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని, ఈ మేరకు అప్పీల్‌కు వెళ్లేందుకు సమయం ఇవ్వాలని, తీర్పు అమలుపై స్టే ఇవ్వాలని కోరారు. ఇందుకు హైకోర్టు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని 25న హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆయనకు రూ.5 లక్షల జరిమానా కూడా విధించింది. ఎన్నికలో రెండో అభ్యర్థిగా నిలిచిన జలగం వెంకట్రావునే 2018 డిసెంబర్‌ 12 నుంచి ఎమ్మెల్యేగా ప్రకటించాలని అధికారులను ఆదేశించింది.